
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి
కంచరపాలెం: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని సీపీఐ రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జె.వి.సత్యనారాయణమూర్తి ఆరోపించారు. రాష్ట్రంలో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై రోజురోజుకూ ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్నారు. సీపీఐ విశాఖ జిల్లా మహాసభల సందర్భంగా కంచరపాలెం మెట్టు నేతాజీ కూడలి నుంచి పాత ఐటీఐ జంక్షన్ వరకు శనివారం పెద్ద ఎత్తున ప్రజా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. కేంద్రంలో మూడోసారి అధికారంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం 2014లో ఇచ్చిన హామీలనే ఇంకా అమలు చేయలేదన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన, నల్లధనాన్ని వెలికితీసి ప్రజలకు పంచుతామన్న హామీలను నెరవేర్చలేదన్నారు. సూపర్ సిక్స్ పథకాల పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడని ప్రశ్నించారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఎప్పుడిస్తారన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో పేదలు ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు అందిస్తే.. సచివాలయ కార్యదర్శుల ద్వారా టీడీపీ నేతలు దరఖాస్తుదారులను బెదిరించారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను రైతాంగ పోరాటం స్ఫూర్తితో తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వానికి అమరావతి తప్ప మరొకటి కనిపించడం లేదని విమర్శించారు. గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం, విజయవాడలో రైల్వేస్టేషన్ ఉండగా.. అమరావతిలో మరో విమానాశ్రయం అవసరమేముందని ప్రశ్నించారు. నెల రోజుల కిందట రిజిస్టర్ అయిన సంస్థకు విశాఖలో 99పైసలకు భూములు కేటాయించడం దారుణమన్నారు. విశాఖలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వానికి భూములు కనిపించడం లేదని మండిపడ్డారు. సభలో జిల్లా నాయకులు ఎం.పైడిరాజు, మానం ఆంజనేయు లు, ఎ.జె.స్టాలిన్, సిహెచ్ రాఘవేంద్రరావు, డి.ఆదినారాయణ, పి.చంద్రశేఖర్, ఎం.మన్మధరావు, జి.రాంబాబు, కె.సత్యాంజనేయ, కె.సత్యనారాయణ, రెహమాన్, శ్రీనివాసరావు, క్షేత్రపాల్, నాయుడు, నాగభూషణం, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
అమరావతి తప్ప మరొకటి కనిపించడం లేదు
సీపీఐ రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శులు