
పది మందికి ఉచిత కంటి ఆపరేషన్లు
రాజవొమ్మంగి: మండలంలోని గడుఓకుర్తి, బూసులపాలెం, అనంతగిరి గ్రామాల్లో కంటి శస్త్రచికిత్సలు అసరమైన పదిమంది వృద్ధులను గుర్తించినట్టు రాజవొమ్మంగి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ సుష్మ చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల కేంద్రంలో పుష్పగిరి కంటి ఆస్పత్రి(విజయనగరం) సౌజన్యంతో శనివారం కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించినట్టు చెప్పారు. శిబిరంలో వైద్య పరీక్షలు చేసి, కంటి ఆపరేషన్లు అవసరమైన వారిని గుర్తించి, విజయనగరంలోని పుష్పగిరి ఆస్పత్రికి తరలించామన్నారు. ఉచితంగా శస్త్రచికిత్సలు చేయిస్తున్నామని, రోగులకు ఉచిత భోజన, వసతి సదుపాయం కల్పిస్తున్నట్టు చెప్పారు. ఆప్తాలమిక్ అసిస్టెంట్ రమణ, ఆశ వర్కర్ సుభద్ర, వెంకటలక్ష్మి, సత్యవతి, చంటమ్మ తదితర పీహెచ్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.