
చెరువు గర్భంలో రోడ్డు తొలగింపు
రోలుగుంట: క్వారీ నుంచి రాయి తరలింపు కోసం మండలంలోని రాజన్నపేట పొలాలకు సాగునీరు అందిస్తున్న చెరువు గర్భంలో నిర్మించిన రహదారిని రోలుగుంట తహసీల్దార్ ఎస్.నాగమ్మ శుక్రవారం తొలగించారు. వివరాలిలా ఉన్నాయి. రాజన్నపేట గ్రామానికి చెందిన పొలాలకు 57/2 సర్వే నంబరులోని భూపతి చెరువు నుంచి సాగునీరు అందుతుంది. గతేడాది రాజమండ్రికి చెందిన ఓ వ్యక్తి సమీపంలోని కొండ ప్రాంతంలో క్వారీ నిర్వహణకు అనుమతి పొందారు. అక్కడి నుంచి రాయిని తరలించడానికి మార్గం లేక చెరువు గర్భంలో రహదారి ఏర్పాటు చేసుకొని యథేచ్ఛగా లారీలతో రాయి తరలింపునకు శ్రీకారం చుట్టాడు. భారీ బండ రాళ్లను రాంబల్లి మండలంలో తలపెట్టిన నేవల్ బేస్ నిర్మాణ పనులకు తరలిస్తున్నారు. దీంతో ఇక్కడ రైతులు తమ భూములకు జరుగుతున్న నష్టాన్ని నిర్వాహకుడికి పలు దఫాలు మొరపెట్టుకున్నారు. చెరువును ఆక్రమించి రోడ్డు వేయడం తగదని అడ్డగించినా ఫలితం లేదు. దీంతో ప్రజా ప్రతినిధులు, కలెక్టర్, నర్సీపట్నం ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయంలో సైతం రైతులు ఫిర్యాదు చేశారు. ఆర్డీవో రమణ ఈ ప్రాంతాన్ని గత వారం తహసీల్దార్ నాగమ్మతో కలిసి సందర్శించి వాస్తవాలపై విచారణ చేపట్టారు. ఈ మేరకు ఇక్కడ చెరువును ఆక్రమించి ఏర్పాటు చేసిన రహదారిని తొలగించి, క్వారీ నిర్వహణలో నిబంధనలు పాటించాలని నోటీసులు జారీ చేశారు. దీనిలో భాగంగా శుక్రవారం మండల సర్వేయర్ నాయుడు, ఆర్.రామమూర్తి, వీర్వో శ్రీనివాస్‌తో కలిసి క్వారీ వద్దకు వెళ్లారు. చెరువు గర్భాన్ని ఆక్రమించి మెటల్, రాతి బుగ్గితో ఏర్పాటు చేసిన రోడ్డును పొక్లెయిన్‌తో తొలగించి, ట్రెంచ్‌లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగానే క్వారీ నిర్వహణ ఉండాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
క్వారీ నిర్వహణలో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
రోలుగుంట తహసీల్దార్ నాగమ్మ హెచ్చరిక