
అడ్డొచ్చింది.. కూల్చేశాం
పెందుర్తి: పెందుర్తి నియోజకవర్గంలో అధికార కూటమి నాయకుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. మండలంలోని గొరపల్లిలో పాత మంచినీటి పథకం ట్యాంక్‌ను జనసేన, టీడీపీ నాయకులు రాత్రికి రాత్రే కూల్చేశారు. తమ సొంత అవసరాలకు ఈ ట్యాంక్ అడ్డు వస్తుందన్న కారణంతో, పంచాయతీ, మండల పరిషత్ అధికారుల అనుమతి లేకుండా దౌర్జన్యకాండకు దిగారు. సొంత నిధులతో జేసీబీని సమకూర్చి ట్యాంక్‌ను కూలగొట్టారు. అర్ధరాత్రి వరకు ఆ శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నించారు.
ఇదెక్కడి దౌర్జన్యం?
సాధారణంగా పంచాయతీ పరిధిలో ఉన్న ఏ పాత భవనం, మంచినీటి పథకం, ఇతర ప్రభుత్వ నిర్మాణాలను కూలగొట్టాలంటే నిబంధనల ప్రకారం పంచాయతీ తీర్మానం తప్పనిసరి. అదే సమయంలో మండల పరిషత్ అనుమతి కూడా ఉండాలి. కానీ, ఇటీవల కాలంలో నియోజకవర్గంలో ఆ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. రెండు నెలల క్రితం జెర్రిపోతులపాలెంలో కల్యాణ మండపం నిర్మించడానికి ఏకంగా అంగన్‌వాడీ కేంద్రం భవనాన్నే కూల్చేయడానికి కూటమి నాయకులు ప్రయత్నించారు. తాజాగా గొరపల్లిలో స్థానిక జనసేన, టీడీపీ కార్యకర్తలు దగ్గరుండి మరీ మంచినీటి పథకం ట్యాంక్‌ను కూల్చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో కొల్లి వెంకట్రావును వివరణ కోరగా, గొరపల్లిలో మంచినీటి పథకం ట్యాంక్ కూల్చివేతకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. పంచాయతీ నుంచి సదరు ట్యాంక్ కూల్చివేతకు ప్రతిపాదన లేదని సర్పంచ్ గొరపల్లి శ్రీను తెలిపారు.
పెచ్చుమీరుతున్న కూటమి నేతల
ఆగడాలు
మంచినీటి ట్యాంక్ కూల్చివేత