రాజవొమ్మంగి: మండలంలోని వట్టిగెడ్డ గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలు మంగళవారం వెలుగు కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఎటువంటి ప్రమేయం, తీర్మానం, సంతకాలు లేకుండా తమ సంఘాలకు స్థానిక యూనియన్ బ్యాంకు రూ. లక్షల్లో రుణాలు మంజూరు చేసి నగదు ఖాతాల్లోకి జమ చేస్తోందంటూ ఆందోళన చేశారు. ఈ మేరకు మంగళవారం సుమారు వంద మంది మహిళలు స్థానిక వెలుగు కార్యాలయం వద్దకు వచ్చి సమస్యను ఏపీఎం రామాంజనేయులు దృష్టికి తెచ్చారు. తమ గ్రామంలోని 15 సంఘాలకు బ్యాంకు లింకేజి రుణాలు మంజూరు చేసి, తిరిగి ఎటువంటి సమాచారం లేకుండానే ఆ సొమ్మును బ్యాంకు తిరిగి జమ చేసుకుందని వాపోయారు. రుణాలపై వడ్డీ తమ నుంచే రికవరీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము తీసుకోని రుణాలకు ఎందుకు వడ్డీ కట్టాలో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై బుధవారం గ్రామానికి వచ్చి విచారణ చేపడతానని ఏపీఎం హామీ ఇవ్వడంతో వారంతా వెళ్లిపోయారు.