దేవీపట్నం: గండి పోశమ్మ అమ్మవారి ఆలయంలో బుధవారం నిర్వహించిన వేలం వాయిదా పడింది. అమ్మవారికి భక్తులు సమర్పించిన కొబ్బరికాయలో సగభాగం పొందడానికి, చీరలు, రవికెలకు, ఆలయ ప్రాంగణంలో పూజాద్రవ్యాలు, అమ్మవారి ఫొటోల విక్రయానికి, లడ్డూ ప్రసాదం తయారీకి వేలం నిర్వహించారు. ఈ పాటలో ఎవరూ పాల్గొనకపోవడంతో దేవదాయ శాఖ అధికారులు వేలం వాయిదా వేశారు. తిరిగి మే 4వ తేదీ ఉదయం 11 గంటలకు ఆలయ ప్రాంగణంలో వేలం నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.
ఆ ఉత్తర్వులు
మత స్వేచ్ఛకు విఘాతం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా ఉన్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ వేలాదిగా క్రైస్తవులు కాకినాడలో బుధవారం ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. కాకినాడ డిస్ట్రిక్ట్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యాన స్థానిక భానుగుడి సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా కాకినాడ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దొమ్మేటి శామ్యూల్ సాగర్, జోషఫ్ బెన్నీ మాట్లాడుతూ, 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేసి, దళిత క్రైస్తవులకు మత స్వేచ్ఛ కల్పించాలని డిమాండ్ చేశారు. పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు వారికి సంఘీభావం తెలుపుతూ క్రైస్తవుల న్యాయ పోరాటానికి తన పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. ర్యాలీ, ధర్నా అనంతరం క్రైస్తవ సంఘాల నాయకులు కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు.
జూన్ నెలాఖరు నాటికి
నూతన టెర్మినల్ భవనం పూర్తి
కోరుకొండ: జూన్ నెలాఖరు నాటికి మధురపూడి విమానాశ్రయంలో నిర్మాణ దశలోఉన్న నూతన టెర్మినల్ భవనం పూర్తవుతుందని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.రాజ్‌కిషోర్ తెలిపారు. విమానాశ్రయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పరిశీలన నిమిత్తం బుధవారం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఇక్కడికొచ్చారు. సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకుని ఇంజినీర్లకు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజమహేంద్రవరం విమానాశ్రయంలో ప్రయాణికుల సౌకర్యార్థం మెరుగైన వసతులు కల్పించనున్నట్టు తెలిపారు. ఇక్కడి నుంచి ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, తిరుపతికి సర్వీసులున్నట్టు, దానికణుగుణంగా అయోధ్య, వారణాసి నగరాలకు నిర్వహించడానికి ఎయిర్‌లైన్స్ సంస్థతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో అథారిటీ జనరల్ మేనేజర్ వసుంధర, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ కె.ప్రీతి, ప్రాజెక్టు ఇన్‌చార్జి వి.శ్రీనివాసు పాల్గొన్నారు.
చినవెంకన్న కల్యాణానికి
భారీగా ఏర్పాట్లు
ద్వారకా తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాన్ని గురువారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా లక్షలాది రూపాయలు వెచ్చించి ఆలయ తూర్పు రాజగోపురం వద్ద భారీ వేదికను నిర్మిస్తున్నారు. ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు పర్యవేక్షణలో ఈ పనులు జరుగుతున్నాయి. కల్యాణ మండప ప్రాంతంతో పాటు, క్షేత్ర పరిసరాలను ఇప్పటికే సిబ్బంది శోభాయమానంగా అలంకరించారు. ఇదిలా ఉంటే కల్యాణ వేడుకను వీక్షించేందుకు విచ్చేసే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ఈ వేడుక కన్నుల పండువగా జరగనుంది. స్వామివారు ఆలయం నుంచి తూర్పురాజగోపురం మీదుగా కల్యాణ వేదిక వద్దకు గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో చేరుకుంటారు. 8 గంటల నుంచి కల్యాణ మహోత్సవం ప్రారంభం అవుతుంది. శుక్రవారం రాత్రి రథోత్సవం జరగనుంది.


