సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలి

Apr 7 2026 8:13 AM | Updated on Apr 7 2026 8:13 AM

సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలి ● కలెక్టర్‌ విజయ సునీత

మార్కాపురం టౌన్‌: మార్కాపురం జిల్లాలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రజల సమస్యలకు అధికారులు సానుకూలంగా చర్యలు తీసుకొని పరిష్కార మార్గం చూపాలని కలెక్టర్‌ విజయ సునీత ఆదేశించారు. మార్కాపురం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్జీదారులు తీసుకొచ్చే సమస్యలకు రాతపూర్వకంగా ఎండార్స్‌మెంట్‌ ఇవ్వాలని సూచించారు. అలాగే వారి సమస్యలను పరిష్కరించి అర్జీదారులతో కలిసి దిగిన ఫొటోను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. అర్జీదారులకు సరైన సమాచారం ఇవ్వకపోవడం వలనే పదే పదే పరిష్కారవేదిక కార్యక్రమానికి వస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. ఇకనుంచైనా అధికారులు పద్ధతి మార్చుకుని ప్రవర్తించాలని తెలిపారు. మొత్తం 167 అర్జీలు ప్రజలు అందించగా వాటిలో రెవెన్యూ 81, ఇతర సమస్యలకు సంబంధించి 86 అర్జీలు అందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ పీ శ్రీనివాసులు, మార్కాపురం, కనిగిరి ఆర్డీఓలు ప్రభాకర్‌, శివరామిరెడ్డి, మైక్రో ఇరిగేషన్‌ పీడీ జెన్నెమ్మ, మైనింగ్‌ ఏడీ రవివర్మ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాలాజీ నాయక్‌తోపాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. మార్కాపురంలో భిక్షాటన చేస్తున్న బాలబాలికలు, మహిళలకు జీవనోపాధి కల్పించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ బాబు వినతిపత్రం కలెక్టరుకు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం భిక్షాటన నిషేధిస్తూ జీవో విడుదల చేశారని, నిరుపేదలకు జీవనోపాధి, పునరావాసం కల్పించి బిక్షాటన పూర్తిగా నిర్మూలించాలని కోరారు.

పింఛను కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నాం

● కనిగిరి మండలం మందలవారిపాలేనికి చెందిన మండ్ల కొండమ్మ భర్త చనిపోయి పదేళ్లు అయింది. 15 నెలల నుంచి వితంతు పింఛను అందడం లేదని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసింది. తనకు వస్తున్న పింఛను ఎందుకు ఆగిందని అధికారులను అడిగినా ఎటువంటి సమాధానం చెప్పడం లేదని, పింఛన్‌ రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని కలెక్టర్‌కు విన్నవించింది.

● అర్థవీడుకు చెందిన సయ్యద్‌ భానూబీ బేగం దివ్యాంగురాలు. ఆమె గర్భిణి అయి మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. వరుసగా మూడు నెలలు పింఛన్‌ తీసుకోవడం కుదరలేదు. దీంతో అధికారులు పింఛన్‌ తొలగించారు. విషయం తెలుసుకుని వెళ్లి అడుగ్గా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని, మేం చేసేదేమీలేదని అధికారులు తెలిపారని, పింఛన్‌ మంజూరయ్యేలా చూడాలని కలెక్టరుకు వినతిపత్రం అందించింది.

Advertisement
 
Advertisement
Advertisement