ప్రధాన కేటాయింపుల వివరాలు
ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వేతనాలు : రూ.13.70 కోట్లు
పారిశుద్ధ్య, నీటి సరఫరా నిర్వహణ : రూ.4.07 కోట్లు
విద్యుత్ చార్జీలు : రూ.5.06 కోట్లు
10శాతం గ్రీన్ బడ్జెట్ : రూ.2.37 కోట్లు
వార్డుల వారీగా అభివృద్ధి పనులకు : రూ.2.60 కోట్లు
సమావేశానికి హాజరైన కౌన్సిల్ సభ్యులు
కై లాస్‌నగర్: 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదిలాబాద్ మున్సిపల్ బడ్జెట్‌ను రూ.157.56 కోట్లతో రూపొందించారు. గతేడాదితో పోల్చితే 10శాతం నిధులు అదనంగా పెంచారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో చైర్‌పర్సన్ బండారి అనూష అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కౌన్సిల్ సభ్యులు ఈ బడ్జెట్‌ను ఏకగ్రీవంగా ఆమోదించారు. అంచనాలతో కాకుండా వాస్తవికంగా జరిగే ఖర్చుల ప్రకారం కేటాయింపులు చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు.
బడ్జెట్ ఆదాయ అంచనాల వివరాలు
నూతన ఆర్థిక సంవత్సరానికి గాను పన్నుల ద్వారా రూ.14కోట్ల 35లక్షల 25వేలు, పన్నేతర విభాగాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే నిధుల ద్వా రా రూ.16కోట్ల 71లక్షల 15వేలు సమకూరనున్నట్లుగా అంచనా వేశారు. అలాగే మున్సిపల్ సాధారణ నిధులు ఆస్తిపన్ను, వేకెండ్‌ల్యాండ్ ట్యాక్స్ సంబంధించిన పన్నుల ద్వారా రూ.30 కోట్లు, నాన్ ప్లాంట్స్ గ్రాంట్స్ కింద రూ.24కోట్లు, ప్లాన్ గ్రాంట్స్ కింద రూ.9కోట్లు ఇతర గ్రాంట్స్ ద్వారా రూ.9కోట్ల 50లక్షల ఆదాయం రానున్నట్లుగా అంచనా వేశారు.
గతేడాదితో పోల్చితే ..
గత బడ్జెట్ కేటాయింపులో పోల్చితే ఈ సారి పలు అంశాల్లో తగ్గించారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల కోసం గతంలో రూ.14.30 కోట్లు కేటాయించగా ఈసారి కొంత కోత విధించారు. పారిశుద్ద్య, నీటి సరఫరా నిర్వహణకు గతంలో రూ.3.08 కోట్లు కేటాయించగా ఈ సారి కొంత పెంచారు. విద్యుత్ చార్జీల బడ్జెట్ గతేడాది రూ.3.81 కోట్లు ఉండగా బకాయిలు భారీగా పేరుకుపోయిన నేపథ్యంలో ఈసారి భారీగా పెంచారు. నిధులు కేటాయించినప్పటికీ ఖర్చు చేయకపోవడంతో 10శాతం గ్రీన్ బడ్జెట్‌ను రూ.4.66 కోట్ల నుంచి సగానికి తగ్గించారు. వార్డుల వారీగా చేపట్టే అభివృద్ధి పనులకు రూ.3.15 కోట్ల నుంచి రూ.2.60 కోట్లకు
తగ్గించారు.
తప్పనిసరిగా చేయాల్సిన కేటాయింపుల్లో ...
పట్టణంలో విలీనమైన ప్రాంతాలు, బీసీ, మైనార్టీల నివాసిత వార్డులు, ఎలాంటి మౌలిక సౌకర్యాలు లేని ప్రాంతాల్లో అంచనా బడ్జెట్ మిగులు నిధుల్లో 1/3 కేటాయింపులు తప్పనిసరిగా చేయాలనే ని బంధనల మేరకు రూ.కోటి 30లక్షల 20వేలను ప్రతిపాదించారు. అలాగే రోడ్ల నిర్మాణం కోసం రూ.65.20లక్షలు, కాలువల నిర్మాణాలకు రూ.45లక్షలు, బ్రిడ్జిలు, కల్వర్టుల నిర్మాణాలకు రూ.15లక్షలు, పార్కులు, ఆట స్థలాలు, ఖాళీ స్థలాల పరిరక్షణ కోసం రూ.5లక్షల చొప్పున అదనంగా కేటాయింపులు చేశారు.
ప్రత్యేక పోలీసు బందోబస్తు..
మున్సిపల్ కౌన్సిల్ తొలి సమావేశం రసాభాసగా మారి ఆందోళన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. పలువురు ఎస్సైలతో పాటు కానిస్టేబుళ్లతో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమావేశం ప్రారంభం నుంచి ముగిసే వరకు వారంతా సమావేశ మందిరంలోనే ఉండి విధులు నిర్వహించడం గమనార్హం.


