కై లాస్‌నగర్: ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా ఈ నెల 2న గ్రామసభలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావుతో కలిసి జిల్లా కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూన్ 2 నుంచి ప్రతిష్టాత్మకమైన ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. గ్రామసభల్లో ప్రజలకు సమగ్ర సమాచారం అందించాలని ప్రభుత్వ ఉద్దేశాన్ని వారికి వివరించాలన్నారు. ఈ సభలను సీఎం సందేశంతో ప్రారంభించి, వార్డు సభ్యుల నుంచి ఎంపీలు, మంత్రుల వరకు అందరినీ భాగస్వాములను చేయాలని సూచించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, గిరిజన రైతులకు ఉచిత పంపుసెట్ల వంటి పథకాల లబ్ధిదారుల వివరాలను గ్రామాల్లో చదివి వినిపించాలని, లబ్ధిదారుల అనుభవాలను ప్రజలతో పంచుకోవాలని చెప్పారు. ఈ వీసీలో కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, డీఆర్డీవో రాథోడ్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


