● అంగన్‌వాడీ కేంద్రాల్లో ‘బ్రేక్‌ఫాస్ట్‌’ ● పౌష్టికాహార లోపానికి చెక్‌ ● జిల్లాలో త్వరలోనే అమలు | - | Sakshi
Sakshi News home page

● అంగన్‌వాడీ కేంద్రాల్లో ‘బ్రేక్‌ఫాస్ట్‌’ ● పౌష్టికాహార లోపానికి చెక్‌ ● జిల్లాలో త్వరలోనే అమలు

Mar 30 2026 8:28 AM | Updated on Mar 30 2026 8:28 AM

● అంగన్‌వాడీ కేంద్రాల్లో ‘బ్రేక్‌ఫాస్ట్‌’ ● పౌష్టికాహార లోపానికి చెక్‌ ● జిల్లాలో త్వరలోనే అమలు

ఆదిలాబాద్‌టౌన్‌: అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు బ్రెక్‌ఫాస్ట్‌ అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలిముద్ద పేరిట చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం ప్రారంభించారు. జిల్లాలో ఆరు నెలల పైబడిన చిన్నారులు చాలా మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. రిమ్స్‌లోని న్యూట్రీషియన్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం వంటి సమస్యలను చూస్తూనే ఉన్నాం. ఈ లోపాన్ని అధిగమించేందుకు ఈ పథకం దోహదపడనుంది.

అల్పాహారం ఇలా..

ప్రస్తుతం ఏడు నెలల నుంచి మూడేళ్ల వరకు చిన్నారులకు బాలామృతం, నెలకు 16 కోడిగుడ్లు ఇస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు ప్రతిరోజు ఉడికించిన గుడ్డు, ఒక పూట భోజనం పెడుతున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, సాంబర్‌తో వడ్డిస్తున్నారు. వీరితో పాటు గర్భిణులు, బాలింతలకు ఈ కార్యక్రమం అమలవుతుంది. అయితే మధ్యాహ్నం తర్వాత చిన్నారులకు భోజనంతో వారు నీరసించిపోతున్నారు. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం చిన్నారులకు కిచిడి, ఉప్మా తదితర అల్పాహారం అందించే ఏర్పాట్లు చేస్తుంది.

పోషకాహారం అందించడమే లక్ష్యంగా..

చిన్నారులకు పోషకాహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం తొలిముద్ద కార్యక్రమాన్ని చేపడుతోంది. జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చాలా మంది చిన్నారుల తల్లిదండ్రులు కూలీ, వ్యవసాయ పనులకు వెళ్తుంటారు. ఉదయం పూట చిన్నారులు ఇంట్లో తినితినకుండానే కేంద్రాలకు వెళ్లడంతో అక్కడ నీరసించిపోతున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో వీరికి భోజనం పెడతారు. అప్పటివరకు నిరీక్షించాల్సిందే. ఈ క్రమంలో చాలా మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. బక్కచిక్కిపోవడంతో పాటు వివిధ రుగ్మతలు వెంటాడుతున్నాయి. పౌష్టికాహారం అందించడంతో వారిలో ఎదుగుదలతో పాటు కేంద్రానికి వచ్చే చిన్నారుల సంఖ్య సైతం పెరగనుంది. చాలా మంది చిన్నారులు 10 గంటలు దాటితే కానీ కేంద్రాలకు రావడం లేదు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేంద్రాలు నడుస్తుండగా, చాలా కేంద్రాల్లో చిన్నారుల గైర్హాజరు కనిపిస్తోంది.

జిల్లాలో

అంగన్‌వాడీ కేంద్రాలు : 1,288

మూడేళ్లు పైబడిన చిన్నారులు: 22వేలు

పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు..

అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల్లో పోషకాహారం లోపం అధిగమించేందుకు తొలిముద్ద కార్యక్రమం ఎంతగానో దోహదపడనుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో త్వరలోనే ప్రారంభిస్తాం. తద్వారా చిన్నారుల గైర్హాజరు శాతం తగ్గనుంది.

– మిల్కా, జిల్లా సంక్షేమ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement