మిగిలింది రెండు రోజులే! | - | Sakshi
Sakshi News home page

మిగిలింది రెండు రోజులే!

Mar 30 2026 8:28 AM | Updated on Mar 30 2026 8:28 AM

● ఆస్తిపన్ను లక్ష్యం చేరడం గగనమే.. ● డిమాండ్‌ రూ.16.05 కోట్లు ● వసూలైంది రూ.8కోట్లు మాత్రమే

కై లాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ పట్టణాభివృద్ధికి ఆస్తి పన్ను ఎంతో కీలకం. సకాలంలో వసూలైతేనే మున్సిపల్‌ పరిధిలో పనిచేసే కార్మికుల వేతన చెల్లింపులు చేసేది. అంతటి కీలకమైన ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యం ఈ సారి చేరేలా కనిపించడం లేదు. మరో రెండు రోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుంది. అయితే సగం కూడా వసూలు కాకపోవడం గమనార్హం. లక్ష్య సాధన కోసం అధికారులు, సిబ్బంది చెమటోడ్చుతున్నా గడువు తక్కువగా ఉండటంతో చేరుకోవడం అసాధ్యంగానే కనిపిస్తోంది.

వసూలైంది సగమే..

గ్రేడ్‌–1 స్థాయి కలిగిన ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తిపన్ను లక్ష్యం రూ.16.5 కోట్లుగా ఉంది. వీటిని వసూలు చేసేందుకు కోసం బల్దియా అధికారులు వార్డు ఆఫీసర్లు, బిల్‌ కలెక్టర్లు, ఆర్‌ఐలతో కూడిన 18 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరు మున్సిపల్‌ ఎన్నికల అనంతరం తమకు కేటాయించిన కాలనీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటికి తిరుగుతూ వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటి వరకు రూ.8 కోట్ల వరకు వసూలు చేశారు. కాగా మొత్తం డిమాండ్‌లో రూ.5.50 కోట్ల పన్నుకు సంబంధించిన ఆస్తులు బ్యాంకుల ఆధీనంలో, వివిధ కోర్టు కేసుల్లో ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. దీంతో ఆ పన్నులు వసూలు కావడం అనుమానమే. వీటిని మినహాయిస్తే మరో రూ.3.50 కోట్ల వసూలు చేయాల్సి ఉంది. మరో రెండు రోజులే సమయమున్నందున వీటిని ఏ మేరకు వసూలు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏటా ఇదే పరిస్థితి ఏర్పడుతున్నప్పటికీ బల్దియా అధికారులు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. లక్ష్య సాధనలో వెనుకబడినట్లయితే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విడుదల నిలిచిపోయే ప్రమాదముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాన్ని ఏ విధంగా అధిగమిస్తారనేది చూడాలి మరి.

గతేడాది ఇలా ..

గత ఆర్థిక సంవత్సరం 2024–25కు గాను పట్టణ ఆస్తి పన్ను లక్ష్యం రూ.15 కోట్లుగా ఉంది. అందులో ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి రూ.7.30 కోట్లు మాత్రమే వసూలు చేశారు. గతేడాది ఆస్తి పన్ను వడ్డీపై ప్రభుత్వం 90శాతం రాయితీ అవకాశం కల్పించింది. దీనిపై అధికారులు విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు పన్నుల వసూళ్లపై దృష్టి పెట్టారు. అయినప్పటికీ లక్ష్యం చేరుకోకపోవడం గమనార్హం. ఈ సారి కూడా ప్రభుత్వం వడ్డీ రాయితీ కల్పిస్తుందని చాలా మంది వ్యాపారులు, ఇంటి యజమానులు ఎదురుచూశారు. కానీ అలాంటి అవకాశం లేకపోవడంతో వారికి నిరాశే ఎదురైంది. ప్రధానంగా బకాయిలపై అధికారులు దృష్టి సారించకపోవడంతో అవి గుదిబండలా మారి పట్టణ అభివృద్ధికి అవరోధంగా నిలుస్తోంది.

స్వచ్ఛందంగా చెల్లించాలి

పట్టణ అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించాలంటే ఆస్తిపన్ను ఎంతో కీలకం. పట్టణ ప్రజలు విషయాన్ని గుర్తించి ఆస్తిపన్ను చెల్లింపును బాధ్యతగా భావించాలి. ఆర్థిక సంవత్సరం ముగింపు వరకు చూడకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎప్పటికప్పుడు చెల్లించాలి.

– కళ్యాణ్‌, రెవెన్యూ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement