పులి చిక్కకుండా.. యంత్రాంగం ఆగకుండా.. | - | Sakshi
Sakshi News home page

పులి చిక్కకుండా.. యంత్రాంగం ఆగకుండా..

Mar 25 2026 6:54 AM | Updated on Mar 25 2026 6:54 AM

బంధించేందుకు విశ్వ ప్రయత్నాలు

రిజర్వ్‌ ఫారెస్ట్‌లో సెర్చ్‌ ఆపరేషన్‌

గంగవరం: పెద్ద పులి చిక్కకుండా తిరుగుతుంటే.. ఎలాగైనా పట్టుకోవాలని అధికార యంత్రాంగం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మంగళవారం కూడా పెద్ద పులి కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగింది. గంగవరం మండలం గొరగుమ్మి, వేములవాడ, ఉయ్యాల మడుగు రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతంలో పెద్ద పులి సంచారాన్ని అటవీ శాఖ అధికారులు రేడియో ట్రాకింగ్‌ ద్వారా కనుగొన్నారు. ఉదయం నుంచి సెర్చ్‌ ఆపరేషన్‌ను ఏపీసీసీఎఫ్‌ శాంతి ప్రియ పాండే ఆధ్వర్యంలో అటవీ శాఖ సిబ్బంది కొనసాగిస్తున్నారు. వేములోవ ప్రాంతంలో మకాం వేసిన పెద్ద పులి సోమవారం రాత్రి నుంచి ఉయ్యాలమడుగు, గొరగుమ్మి, పెదగార్లపాడు శివారు మీదుగా గంగవరం శివారు పోతురాజు బాబు గుడి వద్ద అటవీ ప్రాంతంలోకి సాయంత్రం 6.30 సమయానికి దాటింది. గంగవరం– కొత్తపల్లి ప్రధాన రహదారి దాటి దొరమామిడి జంక్షన్‌ నుంచి ధర్మాడి వద్ద గల ప్రధాన కొండ వద్ద ఉంది. గంగవరం శివారు పోతురాజు బాబు గుడి సమీపంలో రూట్లో దొరమామిడి వెళ్లే రూట్లో ఓ చింత చెట్టు కింద పెద్దపులి విశ్రాంతి తీసుకుంటుంది. దానిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రోన్‌ కెమెరా సహాయంతో పులి కదలికలను గుర్తిస్తున్నారు. గంగవరం– కొత్తపల్లి ప్రధాన రహదారికి 200 మీటర్ల దూరంలోనే పెద్ద పులి ఉంది. ఆ సమీపంలోనే షూటర్లు మాటువేసి ఉన్నారు. ఈ సందర్భంగా సబ్‌ డీఎఫ్‌ఓ వెంకట సుబ్బారెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ గొరగుమ్మి సమీపంలో ఒక ఆవు దూడపై పులి దాడి చేసిందని తెలిపారు. సుమారు 60 మంది సిబ్బంది ఐదు బృందాలుగా ఏర్పడి ఉదయం నుంచి సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారన్నారు. దొరమామిడి గ్రామంలోకి ఎవరినీ వెళ్లకుండా నిలుపుదల చేశామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్ధరాత్రయినా సరే పెద్ద పులిని బంధిస్తామని ఆయన తెలిపారు. రాజమహేంద్రవరం సీసీఎఫ్‌ శ్రీకంఠనాథ్‌ రెడ్డి, డీఎఫ్‌ఓ శివకుమార్‌, కాకినాడ, చింతూరు డీఎఫ్‌ఓలు రామచంద్రరావు, రవీంద్రనాథ్‌ రెడ్డి, సబ్‌ డీఎఫ్‌ఓ సుబ్బారెడ్డి, అనూష తదితరులు పాల్గొన్నారు.

బినామీ అప్పుల వల్లే ముప్పు

ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): బినామీ రుణాల కారణంగానే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులు సహకార సంఘాలు అధికారులపై మండిపడ్డారు. కాకినాడలోని డీసీసీబీ కార్యాలయంలో మంగళవారం టర్న్‌ ఎరౌండ్‌ యాక్షన్‌ ప్లాన్‌ – టీఏపీ) సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బినామీ వ్యవసాయ రుణాలు ఇచ్చి వాటిని వసూలు చేయడంలో జిల్లాలోని ఆరేడు సహకార సంఘాలు చూపిస్తున్న నిర్లక్ష్యం కారణంగా డీసీసీబీ బ్యాంకులో పనిచేస్తున్న సిబ్బంది, సహకార సంఘాల్లో పనిచేస్తున్న సుమారు రెండువేల మంది ఉద్యోగులు రోడ్డున పడే పరిస్థితి ఉందన్నారు. ఒత్తిళ్లు ఉంటే తమకు వ్యక్తిగతంగా చెప్పాలే కానీ బినామీ రుణాలు వసూలు చేయడంలో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోనసీమ, రాజమహేంద్రవరంలలో రికవరీలు బాగా ఉన్నాయని కాకినాడ జిల్లాలో ఏలేశ్వరం, కిర్లంపూడి, గోకవరం తోపాటు పలు బ్రాంచ్‌ల్లో బినామీ రుణాలు ఇవ్వడంతో అక్కడ రికవరీ కష్టంగా మారిందన్నారు. సహకార సంఘాలకు వెళ్లి రికార్డులు ఎందుకు తనిఖీ చేయలేదని బ్యాంకు ఇన్‌చార్జి సీఈవో ప్రవీణ్‌కుమార్‌ను ఆప్కాబ్‌ చైర్మన్‌ నిలదీశారు. తాము వెళ్లినా అక్కడి సీఈవోలు రికార్డులు చూపించడం లేదని ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఏలేశ్వరం శాఖలో రెండువేల మందికి రైతులకు రుణాలు ఇవ్వగా 700 మందికి రుణాలు ఇచ్చిన ఫైల్స్‌ మాత్రమే ఉన్నాయన్నారు. మిగిలినవి తమకు ఇవ్వడం లేదని ఆప్కాబ్‌ చైర్మన్‌కు ప్రవీణ్‌ వివరించారు. నాబార్డు జీఎం కేవీఎస్‌ ప్రసాద్‌, అప్కాబ్‌ ఎండీ ఆర్‌.రామకృష్ణ, డీసీసీబీ చైర్మన్‌ తుమ్మల బాబు పాల్గొన్నారు.

జిల్లా ఇన్‌చార్జి

ట్రెజరీ డీడీగా పాషా

కాకినాడ లీగల్‌: ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి ట్రెజరీ డీడీగా జిల్లా ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ ఆర్‌.పాషాను నియమించారు. జిల్లా ట్రెజరీ డీడీ ఎ.గణేష్‌ వ్యక్తిగత కారణాల వల్ల ఏప్రిల్‌ 18వ తేదీ వరకు సెలవు పెట్టారు. మంగళవారం డీడీ గణేష్‌ బాధ్యతలు పాషాకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement