రోడ్డెక్కి.. నిరసన తెలిపి.. | - | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కి.. నిరసన తెలిపి..

Mar 25 2026 6:54 AM | Updated on Mar 25 2026 6:54 AM

దుశ్చర్తి రోడ్డు కోసం గిరిజనుల ఆందోళన

అడ్డతీగల: ఆ దారుల్లో వెళ్లేందుకు నరకం చూస్తున్నారు.. చివరికి విసిగిపోయి రోడ్డెక్కారు.. దుశ్చర్తి రోడ్డు సాధన కోసం మంగవారం అడ్డతీగలలో గిరిజనులు ఆందోళనకు దిగారు. దుశ్చర్తి, దాకోడు, డి.రామవరం పంచాయతీల్లోని 13 గ్రామాల ప్రజలు ఆదివాసీ గిరిజన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు ఆధ్వర్యంలో స్థానిక ఆదివాసీ భవనం నుంచి ఫ్లకార్డులు చేతబూని ర్యాలీ నిర్వహించారు. దేవీ సెంటర్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం ర్యాలీగా వెళ్లి ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారుల వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు మాట్లాడుతూ మూడేళ్లుగా ఏనుగుకొమ్ము కాలువ నుంచి దుశ్చర్తికి ఏడు కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులను అసంపూర్తిగా వదిలేశారన్నారు. మెటల్‌, వెట్‌మిక్స్‌ వేసి మిన్నకుండడంతో రాళ్లు లేచిపోయి రాకపోకలకు ఇబ్బందికరంగా మారిందన్నారు. ఆ రోడ్డును సరిచేసి పూర్తి స్థాయిలో బీటీ రోడ్డు నిర్మించాలని కోరారు. అనంతరం ఆందోళనకారులతో ఎంపీడీఓ ఏవీవీ కుమార్‌, ఐటీడీఏ ఇంజినీరింగ్‌ అధికారులు చర్చించారు. త్వరలోనే రోడ్డును పూర్తి స్థాయిలో పునర్నిర్మిస్తామని చెప్పారు. దీంతో గిరిజనులు ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement