అడ్డతీగల: అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ అడ్డతీగలలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం రణభేరి పేరిట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక పాత ఎంపీడీఓ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. దీనికి నాయకత్వం వహించిన యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ పలు అంశాల్లో ప్రభుత్వ వైఖరిని తూర్పారపట్టారు. పీఆర్సీ కమిషన్ చైర్మన్ నియామకం వెంటనే జరపాలన్నారు. 29 శాతం ఐఆర్ ప్రకటించాలన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిల చెల్లింపునకు రూట్‌మ్యాప్ ప్రకటించాలన్నారు. సీపీఎస్ రద్దుచేసి మెమో 57 ప్రకారం పాత పెన్షన్ అమలు చెయ్యాలన్నారు. హెల్త్ కార్డులు, మెడికల్ బిల్లులు వెంటనే పరిష్కరించాలన్నారు. కోవిడ్ కాలంలో చనిపోయిన ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలకు కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలన్నారు. ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కారానికి కమిటీని నియమించాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సరెండర్ లీవ్‌ల బకాయిలు చెల్లించాలన్నారు. అడ్డతీగల మండల శాఖ అధ్యక్షుడు అన్నంరెడ్డి గాంఽధీ, ప్రధాన కార్యదర్శి రాఘవులు తదితరులు పాల్గొన్నారు.


