యువకుడిపై పోక్సో కేసు నమోదు
ఐ.పోలవరం: ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ బాలికను మోసగించిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఐ.పోలవరం ఎస్సై రవీంద్రబాబు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఐ.పోలవరం మండలం పరిధి ఎదుర్లంక గ్రామానికి చెందిన బాలిక (17)ను అదే గ్రామానికి చెందిన యువకుడు కమిడి హరినారాయణ ప్రసాద్ పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. పలుసార్లు శారీరకంగా దాడి చేసినట్టు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. దీనిపై అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్ ఐ.పోలవరం పోలీస్ స్టేషన్‌కు వచ్చి విచారించారు. నిందితుడిని అరెస్ట్ చేస్తామని డీఎస్పీ ప్రసాద్ విలేకరులకు తెలిపారు.
పనిముట్లు ధ్వంసం చేస్తున్న ముఠా అరెస్ట్
నల్లజర్ల: సింగరాజుపాలెంలో ఈ నెల 23న అర్ధరాత్రి కొఠారు నారాయణరావుకు చెందిన పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు పొలంలో చొరబడి పంటను, వ్యవసాయ పనిముట్లను ధ్వంసం చేస్తున్న సమయంలో కాపలాదారులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇదే గ్రామానికి చెందిన కొఠారు ప్రదీప్ చక్రవర్తి, ఉంగుటూరుకు చెందిన జీవరత్నం, రాంబాబుతో పాటు మరో ఆరుగురు ఆటోపై వచ్చి నారాయణరావు పొలంలో దోసపాదులు, ఆయిల్‌పామ్ మొక్కలు, బొప్పాయి తదితర పంటలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పొలం కాపలాదారులు ఇందులో ఆరుగురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవికుమార్ తెలిపారు.


