ఊరంతా మొక్కి.. | - | Sakshi
Sakshi News home page

ఊరంతా మొక్కి..

Mar 25 2026 6:54 AM | Updated on Mar 25 2026 6:54 AM

ఇనుగంటివారిపేటలో

నాలుగు రోడ్ల కూడలి

మధ్య ధ్వజస్తంభం

ఇనుగంటివారిపేట గ్రామం మధ్యలో

ధ్వజస్తంభానికి విశిష్టత

ఆలయాలు లేకుండానే ఏర్పాటు

కోరిన కోర్కెలు తీరతాయని ప్రజల నమ్మకం

ప్రత్యేకతను చాటుతున్న వైనం

సీతానగరం: ఆలయాల్లో ధ్వజస్తంభం ఎంతో పవిత్రమైంది.. ఇది గర్భగుడికి ఎదురుగా ఉంటోంది.. భక్తుని చూపుని నేరుగా దేవునిపై పడేలా చేస్తోంది. మూలవిరాట్‌కు, భక్తులకు మధ్య వారధిగా ఉంటోంది. ఆలయానికి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. అయితే ఆ గ్రామంలో ధ్వజస్తంభానికి ఎంతో విశిష్టత ఉంది. ఇది ఆలయానికి ఎదురుగా కాకుండా, ఊరి మధ్యలో ఉండడం ప్రత్యేకతను చాటుతోంది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఇనుగంటివారిపేటలో ఊరి మధ్యలో ఉన్న ధ్వజస్తంభం ఆధ్యాత్మికతను చాటుతుంది. ఆ విశేషమేమిటో తెలుసుకుందాం రండి.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ గ్రామంలో లేని విధంగా సీతానగరం మండలం ఇనుగంటివారిపేట గ్రామం నడిబొడ్డున కూడలి మధ్యలో పెరుమాళ్ల ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. దీనిని తొంభై మూడేళ్ల్ల కిందట ప్రతిష్ఠించారు. కాలానుగుణంగా అది శిథిలావస్థకు చేరుకోవడంతో 2019 జూన్‌లో పునర్నిర్మించారు. ఇక్కడి ధ్వజస్తంభానికి విశిష్టత ఉంది. ఏ గ్రామంలోనైనా ఆలయాల వద్ద ధ్వజస్తంభం ప్రతిష్ఠించడం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఏ ఆలయమూ ఉండదు. నాలుగు రోడ్ల కూడలి మధ్యలో ధ్వజస్తంభం ఉంటోంది. ప్రధానంగా విష్ణాలయం, శివాలయం, రామాలయం వంటి పలు దేవాలయాల వద్ద ధ్వజస్తంభం ప్రతిష్ఠిస్తారు. అయితే ఇనుగంటివారిపేటలో పలు ఆలయాలున్నా, వాటి వద్ద ధ్వజస్తంభం మాత్రం లేదు. గ్రామం నడిబొడ్డున మాత్రం ఉంటోంది.

ఆలయాలు ఉన్నా..

ఇనుగంటివారిపేట గ్రామం మధ్యలో ఉన్న పెరుమాళ్ల ధ్వజస్తంభానికి ఉత్తర, దక్షిణ దిక్కుల్లో రామాలయాలు, తూర్పున శ్రీశాంతి దుర్గమ్మ వారి ఆలయం, పడమర దిక్కున శ్రీలంకాలమ్మ వారు కొలువై ఉన్నారు. ఇవే కాకుండా గ్రామంలో శ్రీలక్ష్మీ గణపతి ఆలయం, షిర్డీసాయిబాబా ఆలయం, భక్తాంజనేయ స్వామివారి ఆలయం ఉన్నా, ఏ ఆలయం వద్ద ధ్వజస్తంభం ప్రతిష్ఠించలేదు. పదహారేళ్ల క్రితం ముగ్గళ్ల పంచాయతీ నుంచి విడిపోయి ఇనుగంటివారిపేట పంచాయతీగా మారింది. 1933లో ప్రతిష్ఠించిన పెరుమాళ్ల ధ్వజస్తంభం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తుల సహకారంతో 2019 జూన్‌ 20న తిరిగి పునః ప్రతిష్ఠించారు. ఇక్కడ భక్తితో కొలిస్తే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడ పూజలు చేస్తుండడం ఆచారంగా వస్తోంది.

ఎందుకు నెలకొల్పారంటే..

పూర్వ కాలంలో ముగ్గళ్ల, ఇనుగంటివారిపేట గ్రామాలు ఇనుగంటి మహారాజు పాలనలో ఉండేవి. అయితే ముగ్గళ్లలో శివాలయం ఉన్నందున, అక్కడ ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు. శైవ, వైష్ణవ ఆగమాలను అనుసరించి ఏ గ్రామంలోనైనా శివాలయం, లేకుంటే ధ్వజస్తంభం ఉండాలి. ఇనుగంటివారిపేటలో శివాలయం లేనందున 1933లో గ్రామ పెద్దలు గ్రంథి పుల్లయ్య, సత్యం మావయ్యకాపు, బిక్కిన వెంకట్రావులు ఆగమాలను అనుసరించి, ఆ గ్రామ నడిబొడ్డులో ఉన్న కూడలి మధ్యలో పెరుమాళ్ల ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ధ్వజస్తంభం ఉన్న గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని, సకల దేవతలు కొలువై ఉంటారని, విజయానికి సంకేతమని ఆ రోజుల్లో ప్రజలు విశ్వసించి గ్రామం మధ్వలో ఈ ధ్వజస్తంభం నెలకొల్పారు.

ఎంతో విశిష్టమైంది

తొంభై మూడేళ్ల్ల కిందట గ్రామం మధ్య కూడలి వద్ద పెరుమాళ్ల ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు. దానిని 2019 జూన్‌లో పునః ప్రతిష్ఠించారు. పెరుమాళ్ల ధ్వజస్తంభం వద్దకు వచ్చి అనుకుంటే ఏ పనైనా జరుగుతుందని, విజయం చేకూరుతుందని ప్రజల ప్రగాఢ నమ్మకం. గ్రామం మధ్యలో ఉన్న ధ్వజస్తంభం ఎంతో విశిష్టమైంది.

–ఆరాధ్యుల వెంకట నారాయణ,

ఇనుగంటివారిపేట

కోరిన కోర్కెలు

నెరవేరతాయి

పెరుమాళ్ల ధ్వజస్తంభం వద్ద కోరిన కోర్కెలు నెరవేరతాయి. గ్రామంలో శివాలయం లేకుంటే ధ్వజస్తంభం లేని గ్రామాలు ఏమీ ఉండవు. ఆనాటి పెద్దలు ఆలోచించి శివాలయం లేని కారణంగా ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకూ పూజలు అందుకుంటుంది. ప్రతి ఏడాది కార్తిక మాసంలో ఆకాశ దీపం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

–సత్యం రాంపండు,

సర్పంచ్‌, ఇనుగంటివారిపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement