ఫ ఆధ్యాత్మిక కాంతుల్లో నిర్మలగిరి
ఫ కనువిందు చేస్తున్న పుణ్యక్షేత్రం
దేవరపల్లి: ఆధ్యాత్మిక కాంతులతో నిర్మలగిరి పుణ్యక్షేత్రం మెరిసిపోతోంది.. చూసిన భక్తుల మది మురిసిపోతోంది.. గౌరీపట్నం నిర్మలగిరి పుణ్యక్షేత్రంలో మేరీమాత ఉత్సవాల సందర్భంగా ఏర్పాటైన విద్యుత్ దీపకాంతులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. క్రైస్తవులే కాకుండా ఇతర మతస్తులు కూడా పుణ్యక్షేత్రానికి తరలివచ్చి వీక్షిస్తున్నారు. పుణ్యక్షేత్రంలోని కలవర కొండపై ఉన్న క్రీస్తు ఆలయం, దిగువన ప్రార్థనా మందిరం, అఖండ దేవాలయం, ప్రధాన ద్వారం వద్ద మరియ తల్లి స్వరూపం, ప్రధాన ద్వారం ఎదురుగా ఫాతిమా టవర్ విద్యుత్ దీపకాంతులతో కొత్త శోభను అద్దుకున్నాయి. ఈ నెల 22న ప్రారంభమైన నిర్మలగిరి మేరీమాత ఉత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి ప్రార్థనలు చేస్తున్నారు. మరియ తల్లికి పూజలు చేసి కొబ్బరి కాయలు కొట్టి, తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఏసుక్రీస్తు ఆలయానికి మెట్లపై మెకాళ్లతో నడిచి వెళ్లి మొక్కులు చెల్లించురకుంటున్నారు. రెండు రోజుల నుంచి భక్తుల రద్దీ పెరిగింది. రాత్రి 8 గంటల నుంచి పుణ్యక్షేత్రం భక్తజన సంద్రం అవుతుంది. ఉత్సవాల చివరి రోజు బుధవారం భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. చివరి రోజు రాత్రి పుణ్యక్షేత్రంలో పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర, శ్రీకాకుళం పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ విజయ్ కుమార్, పుణ్యక్షేత్రం డైరెక్టర్ ఎస్.జాన్‌పీటర్, వివిధ ప్రాంతాలకు చెందిన గురువులు, ఫాదర్లు సమిష్ఠి దివ్యబలిపూజ సమర్పిస్తారని నిర్వాహకులు తెలిపారు. ఏలూరు కథోలిక్ తొలి పీఠాధిపతులు, నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం వ్యవస్థాపకుడు మోస్ట్ రెవరెండ్ జాన్ ములగాడ స్వరూపాన్ని పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర, విజయ్‌కుమార్ ఆవిష్కరిస్తారని పుణ్యక్షేత్రం డైరెక్టర్ జాన్‌పీటర్ తెలిపారు.


