ప్రాణం తీసిన ఈత సరదా | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ఈత సరదా

Mar 25 2026 6:54 AM | Updated on Mar 25 2026 6:54 AM

చెరువులో ఈతకెళ్లిన ఆరుగురు స్నేహితులు

ఇందులో ఇంటర్‌ విద్యార్థి మృతి

కాకినాడ రూరల్‌: ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణం తీసుకుంది.. తిమ్మాపురం పెద్ద చెరువులో ఈ ఘటన జరిగింది. ఈత కోసం ఆరుగురు స్నేహితులు వెళ్లగా ఇందులో ఇంటర్‌ విద్యార్థి ప్రాణాలను కోల్పోయాడు. తిమ్మాపురం పోలీసుల కథనం ప్రకారం.. రమణయ్యపేట పంచాయతీ పరిధి కొత్తూరు బర్మాకాలనీ చెందిన రెడ్డి మురళీకృష్ణ (16) మరో ఐదుగురు కలసి మంగళవారం మధ్యాహ్నం సరదాగా ఈత కొట్టేందుకు తిమ్మాపురం శివాలయం వద్ద ఉన్న పెద్ద చెరువు దగ్గరకు వెళ్లాడు. ఆ ఆరుగురు సరదాగా ఈత కొడుతుండగా, అంతతో ఊబిలో మురళీకృష్ణ మునిగిపోయాడు. స్నేహితులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. మిగతా స్నేహితులు ఒడ్డుకు చేరుకుని స్థానికులకు సమాచారం అందించారు. స్థానికులు, గ్రామస్తులు, సర్పంచ్‌ బెజవాడ సత్యనారాయణ తదితరులు చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. తిమ్మాపురం పోలీసులు చెరువు వద్దకు చేరుకుని విద్యార్థి కోసం గాలించారు. అనంతరం కాకినాడ అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి తాళ్లు పట్టుకుని నీటి లోపల గాలించడంతో మురళీకృష్ణ మృతదేహం లభ్యమైంది. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తిమ్మాపురం ఎస్సై గణేష్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బర్మాకాలనీలో విషాదం

ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ఇటీవలే రాసి రెండో సంవత్సరంలోకి చేరుకున్న రెడ్డి మురళీకృష్ణ మృతితో కొత్తూరు బర్మాకాలనీలో విషాదం అలముకుంది. మురళీకృష్ణ తల్లిదండ్రులు మృతి చెందడంతో అమ్మమ్మ సంరక్షణలో ఉన్నాడు. ఈత కోసం తోటి స్నేహితులతో తిమ్మాపురం చెరువు వద్దకు వెళ్లి మనమడు మృతి చెందినట్టు తెలుసుకున్న అమ్మమ్మ, ఇతర కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement