ఆర్జీయూకేటీలో 3డీ ప్రింటింగ్, డిజైన్ ప్రోగ్రాం
బాసర: బాసర ట్రిపుల్‌ఐటీలో నేషనల్ సెంటర్ ఫర్ ఆడిటివ్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ (ఎన్‌సీఏఎం) సహకారంతో ‘3డీ ప్రింటింగ్ డిజైన్‘ అనే అంశంపై వారం రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ.. అధ్యాపకులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేటి పారిశ్రామిక యుగంలో 3డీ ప్రింటింగ్ ఒక గేమ్ ఛేంజర్ అని, పరిశ్రమలకే కాకుండా వైద్యం, ఏరోస్పేస్, నిర్మాణ సంస్థలు తదితర రంగాల్లో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని పేర్కొన్నారు. అధ్యాపకులు ఈ సాంకేతికతలో నైపుణ్యం సాధించి, విద్యార్థులను భవిష్యత్ సవాళ్లకు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ మురళీదర్శన్ మాట్లాడుతూ.. ఇలాంటి శిక్షణ కార్యక్రమాల ద్వారా ల్యాబ్ నాలెడ్జ్ కాస్తా ప్రాక్టికల్ అప్లికేషన్‌గా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఇది విద్యార్థుల ప్లేస్‌మెంట్లకు కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. ఎన్‌సీఏఎం ప్రతినిధి, ప్రొఫెసర్ శివరామకృష్ణ మాట్లాడుతూ.. వారంపాటు డిజైన్ సాఫ్ట్‌వేర్, మెటీరియల్ సైన్స్, 3డీ ప్రింటర్ల పనితీరుపై లోతైన శిక్షణ ఇస్తామని తెలిపారు. థియరీ మాత్రమే కాకుండా హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అందించడమే తమ లక్ష్యమని వివరించారు. ఎసీఏఎం స్కిల్లింగ్–ఇంక్యూబేషన్ మేనేజర్ డాక్టర్ శ్వేత మాట్లాడుతూ.. డిజైన్ నుంచి ప్రింటింగ్ వరకు ప్రతీ దశలోనూ నైపుణ్యం సాధించేలా ఫ్యాకల్టీకి శిక్షణ ఇస్తామని తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నిపుణులను తయారు చేయడమే తమ లక్ష్యమని వివరించారు. కార్యక్రమంలో సింప్లీ ఫోర్జ్ క్రియేషన్ హెడ్ డాక్టర్ హనుమాన్ నాయక్, మెకానికల్ విభాగాధిపతి చరణ్‌రెడ్డి, కోఆర్డినేటర్ డాక్టర్ పీవీ చంద్రశేఖర్‌రావు, కో కోఆర్డినేటర్ డాక్టర్ నాగరాజు, అసోసియేట్ డీన్‌లు విఠల్, శేఖర్, మహేశ్, అధ్యాపకురాలు శ్రీదేవి, విద్యార్థులు పాల్గొన్నారు.


