దమ్ము ట్రాక్టర్ బోల్తా: డ్రైవర్ దుర్మరణం
కాట్రేనికోన: మండలంలోని వేట్లపాలెంలో దమ్ము ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం..
వేట్లపాలెంలో ఓ పొలంలో డ్రైవర్ గుత్తుల గోణుగోపాలరావు (42) దమ్ము చేసేందుకు పొలంలో దుక్కి చేస్తున్న సమయంలో ట్రాక్టర్ ముందు చక్రాలు పైకి లేచి ఒక్కసారిగా బోల్తా పడింది. ట్రాక్టర్ కింద విగతజీవిగా పడిఉన్న వేణుగోపాలరావును బయటకు తీసేందుకు రైతులు శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. సరిహద్దు పంట చేనులో దుక్కి చేస్తున్న ట్రాక్టర్ సహాయంతో రైతులు బోల్తా పడిన ట్రాక్టర్‌ను తొలగించి వేణుగోపాలరావు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి ఉంది. ఆలనాపాలన చూసుకునే కొడుకు మృతి చెందడంతో ఆ తల్లి దుఖఃసాగరంలో మునిగిపోయింది. కాట్రేనికోన ఎస్సై అవినాష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


