ఓటమి.. నైరాశ్యం
జీర్ణించుకోలేకపోతున్న పలువురు అభ్యర్థులు అపజయానికి కారకులంటూ వేలెత్తి చూపుతున్న వైనం విస్తుపోతున్న పల్లె జనం
సాక్షి, ఆదిలాబాద్: ఇటీవల ఇంద్రవెల్లిలో ఓ వార్డు సభ్యుడిగా పోటీ చేసిన యువ సామాజిక కార్యకర్త ఓటమిపాలయ్యాడు. తన అంచనాల ప్రకారం గెలు పు ఖాయమనుకున్నాడు. అనుకున్నదొకటైతే.. అ య్యింది మరొకటి అన్నట్లు పరాజయం తలుపుతట్టింది. ఎందుకిలా జరిగిందని లెక్కలు వేశాడు. ఎ క్కడ ఓట్లు చేజారాయనే సమీకరణలు తీశాడు. ఒకవేళ ఆ ఓట్లు పడి ఉంటే తన గెలుపు ఖాయమని అనుకున్నాడు. తనకు వారు ఓటు వేయలేదని నిర్ధారించుకున్నాడు. విషయాన్ని జీర్ణించుకోలేకపోయా డు. నా ఓటమికి నువ్వే కారణమంటూ నేరుగా వేలెత్తి చూపాడు. మొదటి విడత పంచాయతీ ఫలితాలు వెలువడిన తర్వాత ఇంద్రవెల్లిలో జరిగిన ఈ ఘట న ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. ప్రజలు ఔరా అనుకునే పరిస్థితి తలెత్తింది.
ఓటమి చెందిన చోటే గెలుపును వెతుక్కోవాలంటారు.. ఇది ఏ రంగానికై నా వర్తిస్తుందని పెద్దలు చెబుతుంటారు. రాజకీయాల్లోకి వచ్చిన యువత తొలిసారి పరాజయం చవిచూస్తే ఓర్పు ప్రదర్శించాలి తప్ప నిరాశకు గురికావద్దు. విజయం దిశగా మరో ప్రయత్నం చేయాలి. అంతేకానీ ఇతరులను నిందించడం సరికాదు. ఇంద్రవెల్లిలో జరిగిన ఘట న ఓటర్లను విస్తుపోయేలా చేసింది. ఆ వార్డులో ఓ సామాజికవర్గం వారు అధిక సంఖ్యలో ఉండటం, గెలిచిన వ్యక్తి అదే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ఓటమి చెందిన అతడికి సందేహాలు తలెత్తాయి. ఆ సామాజికవర్గం వ్యక్తులు తనకు ఓటు వేయలేదని అనుమానించాడు. ఇంకేముంది ఆ వర్గానికి చెందిన పెద్దను ఫోన్‌లో దూషించాడు. ఈ పరిణామాన్ని ఊహించని ఆ పెద్ద తన అనుచరులతో కలిసి శనివారం మార్కెట్ బంద్ చేయించి నిరసన తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం ఇది హాట్‌టాపిక్‌గా మారింది. ఓడిపోతే ఇలా అంటారా అనే ప్రశ్న తలెత్తుతోంది.
ఇంకెన్నెన్నో ..
మొదటి విడత పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యా యి. ఫలితాలు వచ్చాయి. సర్పంచ్‌లు ఎవరనేది తేలిపోయింది. ఉప సర్పంచ్‌ల ఎన్నిక కూడా జరి గిపోయింది. పార్టీల బలాబలాలు స్పష్టమయ్యా యి. ఓటమి చెందిన వారు మాత్రం తాము ఖర్చు చేసిన డబ్బులకు సంబంధించి లెక్కలు కడుతున్నా రు. ఎక్కడెక్కడైతే డబ్బులు పంచారో ఆ ఓట్లు పడ్డా యా లేదా అనే సమీకరణాలు వేసుకుంటున్నారు. కొంతమంది ఈ ఎన్నికల ద్వారా ఆర్థికంగా చతికిలపడ్డారు. అయినప్పటికీ పలువురు ఓర్పు ప్రదర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ రోజు రెండో విడత, ఈనెల 17న మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి చిత్రవిచిత్రాలు ఇంకెన్ని చోటు చేసుకుంటాయో చూడాల్సిందే.


