పెద్దమ్మా.. ‘గుర్తు’ంచుకో
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. రాత్రి వేళలతో చలి తీవ్రత పెరగనుంది. వేకువజామున పొగమంచు ప్రభావం కనిపిస్తుంది.
సమయం : శనివారం సాయంత్రం 6 గంటలు.. ‘అవ్వా.. బాపు ఉన్నాడా.. ఏం చేస్తున్నారు..’ అంటూ గేటు తీసుకుంటూ ఐదారుగురితో కలిసి లోనికి వచ్చాడు ఓ సర్పంచ్ అభ్యర్థి. అయ్యో నువ్వా బిడ్డా.. రా.. రా.. కూర్చో.. ఇప్పుడే బాయి కాడికి పోయి వచ్చినం.. బాబాయ్‌కి కుర్చీ ఇవ్వు అంటూ మనుమనితో అనంగనే.. టైమ్ లేదు పెద్దమ్మ.. రేపే కదా పోలింగ్.. చివరగా అందరినీ కలుస్తున్న.. మన గుర్తు మర్చిపోవద్దు.. అంటూ చేతిలో ఉన్న ఓటరు జాబితా తీసి మనింట్ల ఐదో ట్లు ఉన్నయ్ కదా.. అని టిక్ మార్కు పెట్టుకున్నడు.. వెంటనే వెనకాల బ్యాగ్ పట్టుకొని ఉన్న వ్యక్తి రూ.500 నోట్లు పది ఇచ్చిండు.. మాకెందుకు బిడ్డా పైసలు.. మేము దూరపోల్లమా.. అంటూనే రూ.5వేలు తీసుకొని నువ్వు మల్లమల్ల చెప్పాల్నా.. మాయి పక్కా నీకే బిడ్డా.. అంది. అది కాదు పెద్దమ్మ ఆపోసిటోళ్లు కూడా వస్తరు.. వాళ్లిచ్చినా తీసుకోండి.. కానీ ఓటు మనకే పడా లే.. అన్న అభ్యర్థి మాటలు పూర్తి కాకుండా నే.. నువ్వు ఉండంగ వేరే వాళ్లకు ఎట్లేత్తం బిడ్డా.. వాళ్లు పది వెలిచ్చినా ఎయ్యం.. నువ్వు మనోనివి.. ఆపద.. సంపదకి వచ్చేటోనివి.. నిన్న కోడలు కూడా ఇంటికొచ్చి బొట్టు పెట్టి చెప్పింది.. అని చెప్పంగనే.. గట్లనే పెద్దమ్మ యాది మరువద్దు.. మీ అందరి దీవెనలు ఉండాలె.. తమ్ముడు.. మరదలు.. చిన్నోడు.. బాపు.. నువ్వు అంతా కలిసి ఎగిలి వారంగనే వచ్చి ఓటేయండి. మనోళ్లందరికీ చెప్పండి.. గుర్తు మరిచిపోవద్దు.. మళ్లా కొడుకు రాలేదనుకోవద్దు.. ఇప్పటికే లేట్ అయింది.. పంచుడు మన కానుంచే మొదలు పెట్టిన.. ఇంకా పది వార్డులున్నయ్.. యూత్ పిలగన్లకు దావత్ నడుస్తంది.. తమ్ముడు ఆడనే ఉన్నడు.. ఈ ఒక్క రాత్రి జాగారమే.. మరిచిపోకు పెద్దమ్మ.. బాపు పోయస్తనే.. అనగానే బైక్‌పై ఉన్న బాక్స్‌లో నుంచి ఓ వ్యక్తి క్వాటర్.. లీటర్ థంసప్ బాటిల్ ఇయ్యంగనే పెద్దాయన మొఖం ఎలిగిపోయింది.. అన్నకు జై.. గుర్తూ గుర్తుంచుకో.. అంటూ వచ్చిన వాళ్లు జై కొడుతూ వెళ్లిపోయారు. ఇలా చివరి రోజు అభ్యర్థుల ప్రచార పర్వం సాగింది. మద్యం, డబ్బు, విందులతో పల్లె పండుగ చేసుకుంది. – సాక్షి, ఆదిలాబాద్ డెస్క్


