రోడ్డెక్కిన సోయా రైతులు
బోథ్: మూసివేసిన సోయా కొనుగోలు కేంద్రాలను తెరిపించాలని డిమాండ్ చేస్తూ రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. మండల కేంద్రంలోని రహదారిపై సుమారు గంటపాటు బైఠాయించి నిరసన తెలిపారు. తమ వద్ద ఇంకా పంట నిల్వలు ఉన్నాయని, ఇప్పుడే కేంద్రాలను మూసివేస్తే ప్రైవేట్‌లో తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన కారణంగా రహదారికి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న సీఐ గురుస్వామి, ఎస్సై శ్రీ సాయిలు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. మార్క్‌ఫెడ్, జిల్లా స్థాయి అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సోమవారం లోపు కొనుగోలు కేంద్రాలను తెరవకుంటే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇందులో బీఆర్‌ఎస్ నాయకులు పోతన్న, శ్రీనివాస్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


