ముగిసిన రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలు
ఆదిలాబాద్: జిల్లా కేంద్రం సమీపంలోని ఓక్లే ఇంటర్నేషనల్ పాఠశాలలో సోమవారం ప్రారంభమైన 10వ వింటర్ రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ పోటీలు మంగళవారంతో ముగిశాయి. పోటీల్లో ఓవరాల్ చాంపియన్‌గా హైదరాబాద్ జిల్లా జట్టు నిలిచింది. విజేతలకు డీటీఎస్‌వో పార్థసారథి, స్విమ్మింగ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమేష్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డీటీఎస్‌వో మాట్లాడుతూ జిల్లాలో స్విమ్మింగ్ క్రీడాభివృద్ధికి అసోసియేషన్ ప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటిన క్రీడాకారులు జాతీయస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. ఉమేష్ కుమార్ మాట్లాడుతూ ఈనెల 28 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీల్లో స్విమ్మర్లు రాణించేలా ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సాయిని రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము కృష్ణ, డాక్టర్ క్రాంతి కుమార్, ఆదిత్య ఖండేశ్కర్, బారే శ్రీధర్, రాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
గ్రూప్ 1 బాలుర విభాగంలో బగ్గు గౌతమ్ శశివర్ధన్ నాయుడు 3 స్వర్ణాలు, 2 రజతాలు, గ్రూప్ 2 లో ఎస్‌ఎస్.సచిన్ సాత్విక్ 5 స్వర్ణాలు, గ్రూప్ 3లో అర్జున్ కాస్వన్ 5 స్వర్ణాలు, గ్రూప్ 4 విభాగంలో 2 స్వర్ణాలు సాధించారు. బాలికల్లో గ్రూప్ 1 విభాగంలో హర్షిత వర్మ 4 స్వర్ణాలు ఒక రజతం, గ్రూప్ 2లో శివాని కర్ర 5 స్వర్ణ, గ్రూప్ 3 విభాగంలో సంయుక్త 3 స్వర్ణాలు, ఒక రజతం, గ్రూప్ 4 విభాగంలో అడ్డూరి జాగృతి శ్రీనివాసరావు 2 స్వర్ణ పతకాలు సాధించారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొమ్ము చరణ్‌తేజ్ 400 మీటర్ల ఐఎం ఈవెంట్‌లో, అనిరుధ్ 50 మీటర్ల బెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్‌లో కాంస్య పతకాలతో మెరిసారు. మొత్తంగా హైదరాబాద్ జిల్లా జట్టు మొత్తం 51 స్వర్ణాలు, 45 రజతాలు, 23 కాంస్య పతకాలతో 266 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్‌షిప్, ద్వితీయస్థానంలో నిలిచిన రంగారెడ్డి 245 పాయింట్లతో 40 స్వర్ణాలు, 41 రజతాలు, 43 కాంస్య పతకాలు సాధించింది. తృతీయస్థానంలో కరీంనగర్, నాలుగో స్థానంలో ఆదిలాబాద్ జట్టు నిలిచాయి.


