రెక్కల పురుగు నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి
జన్నారం: యాసంగి సీజన్‌లో రైతులు సాగు చేసిన వరినారును రెక్కల పురుగు ఆశిస్తుందని, దీని నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంచిర్యాల ఏడీఏ ఎం.కృష్ణ సూచించారు. మంగళవారం జన్నారం మండలంలోని మొర్రిగూడలో వరి నారుమడిని పరిశీలించారు. ఈ సందర్భంగా నారును ఆశించే పురుగు, తెగుళ్ల గురించి రైతులకు వివరించారు. రెక్కల పురుగు ప్రస్తుతం గుడ్లుపెట్టే దశలో ఉందన్నారు. నాటు వేసే ఐదురోజుల ముందు నారుమడిలో క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. మొగి పురుగును మొదటి దశలోనే నివారించడానికి పొలంలో క్లోరాంట్రానిలిప్రోల్ ఎకరానికి 60 మిల్లీలీటర్లు పిచికారీ చేయాలన్నారు. నాటు వేసే సమయంలో నారు కొనలు తుంచి నాటుకుంటే మొగి పురుగు అదుపులో ఉంటుందన్నారు. నాటు వేసిన 15 రోజులకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు ఎకరాకు 4 కేజీల చొప్పున వేసుకుంటే కాండం తొలిచే పురుగుబాధ తగ్గుతుందన్నారు.
ఆయిల్‌పాం తోటల పరిశీలన
మండలంలోని దేవునిగూడలో ఆయిల్‌పాం తోటలను పరిశీలించి సాగులో రైతులు అవలంబించాల్సిన పద్ధతులు, దిగుబడికి సంబంధించి పలు సూచనలు చేశారు. అనంతరం వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి తాలు, తప్పలేని, 17 శాతం లోపు తేమ ఉన్న వడ్లను మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు సయ్యద్ అక్రమ్, దివ్య, రైతులు గుర్రం గోపాల్‌రెడ్డి, కళ్ళెం బాపురెడ్డి, ముత్యం రాజన్న, భుక్య రాజు, బాదవత్ రాజు నాయక్, కొట్టె గంగన్న, తదితరులు పాల్గొన్నారు.


