ముగిసిన నామినేషన్ల స్వీకరణ
పంచాయతీ ఎన్నికల్లో తొలిఘట్టం పూర్తి
మొదటి విడతలో ఇప్పటికే పూర్తయిన పరిశీలన, ఉపసంహరణ
పలుచోట్ల సర్పంచ్, వార్డుసభ్యుల ఏకగ్రీవం
అక్కడ ప్రచారం కూడా షురూ..
రెండో విడత అభ్యర్థులు తేలేది నేడే
సాక్షి,ఆదిలాబాద్: పంచాయతీ ఎన్నికల్లో నామినేష న్ల పర్వానికి తెరపడింది. జిల్లాలో మూడు విడతల్లో ఈ ఎన్నికలు జరగనుండగా, స్వీకరణ ఘట్టం శుక్రవారంతో ముగిసింది. మొదటి విడతకు సంబంధించి ఇప్పటికే పరిశీలన, ఉపసంహరణ ఘట్టం పూర్తవగా ఈ విడతలోని పలు జీపీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఏకగ్రీవాలు కూడా స్పష్టమయ్యాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరెవరనేది తేటతెల్లమైంది. వారికి గుర్తులు కూడా కేటాయించారు. ఇక రెండో విడతకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రి య పూర్తి కాగా, శనివారం ఉపసంహరణ ఘట్టం సాగనుంది. మూడో విడతకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ పూర్తయినప్పటికీ శుక్రవారం రాత్రి వరకు ఎన్ని వచ్చాయనే దానిపై సంఖ్యాపరంగా అధికారులకు ఇంకా స్పష్టత రాలేదు.
ఏకగ్రీవం..
మొదటివిడతకు సంబంధించి పలు సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విడతకు సంబంధించి ఏకగ్రీవాల సంఖ్యపై పంచాయతీ అధికారులు స్పష్టంగా ప్రకటించారు. రెండో విడతలో ఏకగ్రీవాలు, అభ్యర్థులు పోటీలో ఎవరెవరనేది నేడు తేలనుంది. ఈ విడతకు సంబంధించి ఉపసంహరణ ఘట్టం ఈరోజు జరగనుండగా, ఆయా పంచాయతీల్లో పోటీ పరిస్థితిపై ఆసక్తి నెలకొంది. ఇక మూడో విడత నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం పూర్తి కాగా, శనివారం పరిశీలన ప్రక్రియ జరగనుంది. వచ్చే మంగళవారం ఉపసంహరణ ప్రక్రియ ఉంది. మొదటి విడతకు ఈనెల 11న, రెండో విడతకు 14న, మూడో విడతకు 17న ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరగనుంది. పోలింగ్ జరిగిన రోజే ఓట్ల లెక్కింపు చేస్తారు. ఆ ప్రక్రియ పూర్తయితే అదే రోజు ఫలితాలు వెలువడతాయి.
ఎన్నికలు జరిగే మండలాలు..
జిల్లాలో ఆదిలాబాద్‌అర్బన్ మినహా మిగతా 20 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నా యి. మొదటి విడతలో 6 మండలాలు ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ, సిరికొండ, ఇచ్చో డ, రెండోవిడత 8 మండలాలు ఆదిలాబాద్‌రూరల్, మావల, బేల, జైనథ్, సాత్నాల, భోరజ్, తాంసి, భీంపూర్, మూడో విడత 6 మండలాలు బోథ్, సొ నాల, బజార్‌హత్నూర్, నేరడిగొండ, గుడిహత్నూర్, తలమడుగులో ఎన్నికలు జరగనున్నాయి.
ప్రచారం షురూ..
మొదటి విడతలో బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరెవరనేది స్పష్టత రావడంతో అభ్యర్థులు వారికి కేటాయించిన గుర్తులతో ప్రచార పర్వం మొదలుపెట్టారు. ఇక ఆయా పార్టీలు తాము బలపర్చిన అభ్యర్థుల విజయం కోసం రంగంలోకి దిగాయి. నియోజకవర్గ, మండల, పంచాయతీ పార్టీ ముఖ్య నేతలు తమ అభ్యర్థి గెలుపు కోసం ప్రణాళికలు రూపొందించి ముందుకు కదులుతున్నారు. మొత్తంగా పంచాయతీ పోరు రసవత్తరంగా సాగుతుంది.
విడతల వారీగా పంచాయతీ ఎన్నికల పరిస్థితి..
విడత సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం వార్డు స్థానాల సంఖ్య ఏకగ్రీవం
మొదటి 166 33 1390 953
రెండో 156 –– 1260 ––
మూడో 151 –– 1220 ––
మొత్తం 473 33 (ఇప్పటివరకు) 3870 953 (ఇప్పటివరకు)


