‘డబుల్’ సిద్ధం
కై లాస్‌నగర్: గత ప్రభుత్వ హయంలో నిర్మాణాలు పూర్తయి పేదలకు కేటాయించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీకి ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. ప్రభు త్వ ఆదేశానుసారం నెలాఖరులోగా అర్హులైన వారికి అందజేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. సగం ఇళ్లకు గాను రెండేళ్ల క్రితమే లబ్ధిదారులను ఎంపిక చేయగా వారిని నిర్ధారించేందుకు మరోసారి బుధవారం నుంచి క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టనున్నారు. గతంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించనున్నారు. వీరి లెక్క తేలాక మిగతా ఇళ్లకు సైతం లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. సొంతింటి కల త్వరలోనే సాకారమయ్యే అవకాశముండటంతో అర్హులైన వారిలో ఆనందోత్సాహలు వ్యక్తమవుతున్నాయి.
రెండేళ్ల నిరీక్షణకు తెర..
నిరుపేదల సొంతింటి కల సాకారం చేయాలనే ఉద్దేశంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఆదిలాబాద్ పట్టణ పరిధిలో పేదల కోసం అపార్ట్‌మెంట్ తరహాలో ఇళ్లను నిర్మించారు. కేఆర్‌కే కాలనీలో 760, మావలలోని సర్వేనంబర్ 170లో 44వ జాతీయ రహదారిని ఆనుకుని 222 ఇళ్లను నిర్మించారు. కేఆర్‌కే కాలనీలోని ఇళ్లను కలరింగ్‌తో సిద్ధం చేశారు. విద్యుత్, రోడ్లు, డ్రెయినేజీలు వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. ఇక మావలలోని ఇళ్లను పూర్తి చేసినప్పటికీ ఇంకా రంగులు వేయలేదు. మౌలిక సౌకర్యాలు మినహా మిగతా నిర్మాణాలు పూర్తయిన 982 ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు 2023 మే 9న అప్పటి కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించారు. 618 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. అయితే రెండేళ్లుగా పంపిణీ చేయకపోవడంతో వారికి నిరీక్షణ తప్పలేదు.
నేటి నుంచి క్షేత్రస్థాయి సర్వే
పట్టణంలోని డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీకి సంబంధించి అర్హుల గుర్తింపునకు బుధవారం నుంచి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించనున్నారు. రెండేళ్ల క్రితం 618 మందిని ఎంపిక చేశారు. అయితే అందులో కొంతమందికి తాజాగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి, మరి కొంత మంది వలస వెళ్లారు, కొంతమంది మరణించారు. మరికొంతమంది తా ము స్థలాలను కొనుగోలు చేశామని తమకు ఇంది రమ్మ ఇళ్లు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇలాంటి వివరాలను పరిశీలించి అర్హుల లెక్క తేల్చేందుకు మున్సిపల్ ఆధ్వర్యంలో నేటి నుంచి సర్వే చేపట్టనున్నారు. పట్టణంలోని 49వార్డుల అధికారులకు ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాతో పాటు ఇందిరమ్మ ఇళ్ల కోసం అందిన ఎల్1, ఎల్2 దరఖాస్తుదారుల వివరాలను అందించారు. వారు ఆయా వార్డుల్లో ఇంటింటికి వెళ్లి దరఖాస్తుదారుల వివరాలు సేకరించనున్నారు. వారికి పక్కా ఇల్లు ఉందా, ఇంటి స్థలం ఉందా, వాస్తవంగా నిరుపేదలేనా అనే వివరాలపై ఆరా తీయనున్నారు. వాటి ఆధారంగా అర్హులను ఎంపిక చేసి మరోసారి లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.
మౌలిక సౌకర్యాల కల్పనకు ఆదేశం...
డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీపై సోమవారం మున్సిపల్, ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ, హౌసింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ రాజర్షి షా ఈ నెలాఖరులోగా అర్హులైన వారికి వాటిని పంపిణీ చేయాలని ఆదేశించారు. అలాగే మౌలిక సౌకర్యాలు పూర్తిస్థాయిలో కల్పించాలన్నారు. ఆ దిశగా ఆయా శాఖల అధికారులు చర్యలు చేపట్టారు.
నేటి నుంచి సర్వే..
ఈ నెలాఖరులోగా అర్హులైన వారికి డబుల్ బె డ్‌రూం ఇళ్లు పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇది వరకు ఎంపిక చేసిన లబ్ధిదా రుల వివరాలను సేకరించేందకు మరోసారి క్షేత్రస్థాయి సర్వే చేపడుతున్నాం. వార్డు ఆఫీ సర్ల ద్వారా బుధవారం నుంచి ఇంటింటి సర్వే నిర్వహిస్తాం. అలాగే ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఎల్1, ఎల్2లో ఉన్న వారిని గుర్తించేందుకు సైతం వివరాలు సేకరిస్తాం. ఎల్2లో ఉన్న వారికి కూడా డబు ల్ బెడ్‌రూం అందేలా చర్యలు తీసుకుంటాం.
– సీవీఎన్ రాజు, మున్సిపల్ కమిషనర్
జిల్లాలో డబుల్ బెడ్‌రూం పథకం వివరాలు
ఇళ్ల కోసం అందిన దరఖాస్తులు : 9,486
విచారణలో తేలిన అర్హులు : 3,790
కేటాయింపునకు సిద్ధంగా ఉన్న ఇళ్లు: 982
ఎంపిక చేసిన లబ్ధిదారులు : 618
ఎల్–1 దరఖాస్తుల సంఖ్య : 12వేలు
ఎల్–2 దరఖాస్తుల సంఖ్య: 8వేలు


