వేగం.. తీస్తున్న ప్రాణాలెన్నో
హైవేపై తరచూ ప్రమాదాలు ఓవర్‌లోడ్, మద్యం మత్తుతోనే అధికం కుటుంబాల్లో తీరని విషాదం ఘటనలు చోటు చేసుకున్నప్పుడే అధికారుల హడావుడి
ప్రమాదాలు సంఖ్య
ఆదిలాబాద్‌టౌన్: మితిమీరిన వేగం.. మద్యం మత్తు.. రహదారి నిబంధనలు పాటించకపోవడం.. తదితర కారణాలేమైనా తరచూ జాతీయ రహదారి 44పై ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో నిత్యం ఎక్కడో ఓ చోట ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో రహదారులు నెత్తురోడుతుండగా, విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. బాధిత కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడే సంబంధిత అధికారులు హడావుడి చేస్తున్నారే తప్ప నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలున్నాయి. జాతీయ రహదారి కొన్ని ప్రాంతాల్లో ఏటవాలుగా ఉండటం, లారీలు అతివేగంగా రావడం, న్యూట్రల్ చేయడంతో ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
తరచూ ప్రమాదాలు ఇక్కడే..
జిల్లాలో తరచూ భోరజ్ చెక్‌పోస్టు, గుడిహత్నూర్ మండలంలోని మేకలగండి, సీతాగోంది, నేరడిగొండ, గుడిహత్నూర్ మండల కేంద్రంలో అధిక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కుప్టి, బోథ్ ఎక్స్‌రోడ్, ఉట్నూర్ ఎక్స్‌రోడ్ ప్రాంతాలూ డేంజర్ స్పాట్స్‌గా మారాయి. జిల్లాలోని జాతీయ రహదారి 44 నేరడిగొండ నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు ఫోర్‌లేన్‌పై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రాత్రి సమయంలో మితిమీరిన వేగంతో నడపడంతో చిన్న వాహనాలను ఢీకొడుతున్నాయి. సర్వీసు రోడ్లు, అక్కడక్కడ అండర్‌పాస్‌లు వంటివి నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. లారీ, ఐచర్, ట్రక్‌లను డ్రైవర్లు న్యూట్రల్ చేసి తీసుకెళ్లడంతో స్పీడ్ అదుపు చేయలేక వాహనాలను ఢీకొడుతున్నాయి. అలాగే ఆటోలు, జీప్‌లలో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్నారు. దీనికితోడు రోడ్లు గుంతలమయంగా ఉండడంతో వాహనదారులు తరచూ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు.
ప్రమాదాలకు కారణాలివే..
వాహనదారులు చాలా మంది నిబంధనలు పాటించడం లేదు. దీంతోనే రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డుపైనే వాహనాలు నిలపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, రాంగ్‌రూట్‌లో వాహనాలను తీసుకెళ్లడం, తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం, ఆటోలు, జీపులు, కార్లలో పరిమితికి మించి ప్రయాణికులను తరలించడం, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం, తదితర కారణాలతో ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. భద్రత చర్యలు చేపట్టకపోవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లాలో రవాణా శాఖాధికారుల తనిఖీ లు నామమాత్రంగా మారాయనే విమర్శలున్నా యి. పోలీసు అధికారులు తనిఖీలు చేపట్టినప్పటికీ నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధిస్తున్నారే తప్పా ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టడం లేదని పలువురు పేర్కొంటున్నారు.
సంవత్సరం రోడ్డు మృతుల
2021 245 145
2022 234 137
2023 286 126
2024 349 136
2025
(ఇప్పటి వరకు) 277 103


