
అంగన్‌వాడీ కార్యకర్తపై కులవివక్ష
వాంకిడి(ఆసిఫాబాద్): వాంకిడి మండలం చిన్న బెండార గ్రామంలో అంగన్‌వాడీ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఇగురపు లక్ష్మిపై గ్రామస్తులు కుల వివక్ష చూపుతున్నట్లు తమ పరిశీలనలో వెల్లడైందని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు తెలిపారు. శుక్రవారం చిన్న బెండార గ్రామాన్ని సందర్శించి విచారణ జరిపారు. ఐదేళ్ల క్రితం చిన్న బెండారకు అంగన్‌వాడీ టీచర్ ఇగురపు లక్ష్మి అనే దళిత మహిళ బదిలీపై వచ్చిందన్నారు. అప్పటి నుంచి అడపాదడపా ఆమైపె స్థానికులు కొందరు కుల వివక్ష చూపుతున్నా పట్టించుకోకుండా విధులు నిర్వర్తిస్తుందని తెలిపారు. పి ల్లల కోసం వండిన అన్నం కూడా తినకుండా బహిష్కరిస్తున్నారని తెలిపారు. గ్రామస్తులకు చట్టాలపై అవగాహన కల్పించి సహపంక్తి భోజన కార్యక్రమాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నివేదికను కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ ఉపాధ్యక్షుడు, అట్రాసిటీ కమిటీ సభ్యుడు రేగుంట కేశవ్‌రావు, భారతీయ బౌద్ద మహాసభ జిల్లా అధ్యక్షుడు, అట్రాసిటీ విజిలెన్స్ కమిటీ సబ్యుడు అశోక్ మహోల్కర్, నాయకులు గోపాల్‌నాయక్, ఇగురపు గణేష్, శ్యాంరావు, పొన్నాల నారాయణ తదితరులు పాల్గొన్నారు.