
లెక్క తేల్చేలా..
7వ చిన్ననీటి వనరుల గణనకు శ్రీకారం 230 మంది ఎన్యూమరేటర్లు ఎంపీఎస్‌వో, డిప్యూటీ ఎస్‌వోలకు శిక్షణ
కై లాస్‌నగర్: సాగునీటి వనరుల లెక్క తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఏడో చిన్ననీటి పారుదల వనరుల గణనకు శ్రీకారం చుట్టింది. సర్వే నిర్వహణకు గాను ప్రణాళికశాఖ మండల, డివిజినల్ స్టాటిస్టికల్ ఆఫీసర్లకు జిల్లాస్థాయిలో ఇది వరకే శిక్షణ పూర్తి చేశారు. క్షేత్రస్థాయిలో గణనకు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రణాళిక శాఖలో గతంలో పనిచేసిన కంప్యూటర్ సూపర్‌వైజర్లను ఎన్యూమరేటర్లుగా ఎంపిక చేశారు. ఆగస్టు 30 వరకే ఈ గణన పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ భారీ వర్షాల నేపథ్యంలో కొంత ఆలస్యమైంది. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే ఈ గణనను ప్రారంభించనున్నారు. అక్టోబర్ 30 వరకు పూర్తి చేయాలని భావిస్తున్నారు. తద్వారా జిల్లాలో సాగునీటి వనరులతో పాటు వాటి కింద సాగవుతున్న ఆయకట్టు విస్తీర్ణం లెక్క తేలనుంది. అలాగే భూగర్భజలాల సంరక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై కేంద్రం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేయనుంది.
ఉద్దేశమేంటంటే..
భూగర్భజలాల వినియోగం ఏ స్థాయిలో ఉంది.. నీటి మట్టం తగ్గుతుందా, పెరుగుతుందా.. అనేదాన్ని అంచనా వేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఐదేళ్లకోసారి చిన్ననీటి వనరుల గణనను చేపడుతుంది. ఇది వరకు 2018–19లో ఈ ప్రక్రియను మ్యానువల్‌గా చేపట్టారు. నిర్ణీత ప్రొఫార్మాతో కూడిన మాడ్యూల్స్‌ను సిబ్బందికి అందజేశారు. వారు క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలను అందులో నమోదు చేసి కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. తాజాగా ఈ ఏడాది మళ్లీ సర్వే చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. తదనుగుణంగా ప్రణాళిక శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశారు.
సాగునీటి వనరుల గుర్తింపు..
వ్యవసాయ సాగుకు ఉపయోగపడే బోరుబావులు, తవ్వకం బావులు, నీటికుంటలు, వాగులు, చెరువులు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, చెక్‌డ్యాంలు వంటి చిన్ననీటి వనరులన్నింటిని గుర్తించనున్నారు. ఇందుకోసం జిల్లాలోని 509 రెవెన్యూ గ్రామాలకు గాను ఉపాధి హామీలో పనిచేసే 200 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రణాళికశాఖకు చెందిన 30 మంది కంప్యూటర్ సూపర్‌వైజర్లు కలిపి ఎన్యూమరేటర్లుగా ఎంపిక చేశారు. ఒక్కొక్కరికి రెండు, మూడు గ్రామాలను కేటాయించనున్నారు. ఈ వివరాల నమోదు కోసం కేంద్రం ఎంఐ సెన్సెస్ అనే ప్రత్యేక యాప్ రూపొందించింది. ఎన్యూమరేటర్లకు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను కేటాయించారు. ఆ ప్రకారం వారు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఆయా వనరులను గుర్తించనున్నారు. వాటి ఫొటో క్యాప్చర్ చేసి, లాంగ్‌ట్యూడ్, ల్యాటిట్యూడ్‌తో పాటు వాటిని ఏ సంవత్సరంలో తవ్వారు, నిర్మించారు.. అందుకు ఎంత వ్యయమైంది.. ప్రస్తుతం ఉపయోగంలో ఉందా.. లేకుంటే ఎన్నేళ్లుగా లేదు.. వాటి ద్వారా ఎన్ని ఎకరాల భూమి సాగువుతుంది.. నీటి మట్టం ఎంత ఉంది అనే వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేయనున్నారు. అందులో గతంలో గుర్తించిన వనరుల సమాచారం సైతం ఉండనుంది. ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటే మార్చనున్నారు. ఈ ప్రక్రియను మండల స్థాయిలో మండల స్టాటిస్టికల్ ఆఫీసర్, డివిజన్ స్థాయిలో డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ సూపర్‌వైజర్లుగా పర్యవేక్షించనున్నారు. ఒక్కో గ్రామంలోని నీటి వనరుల గణనకు గాను ఎన్యూమరేటర్‌కు రూ.1,750 చొప్పున కేంద్రం పారితోషకం చెల్లించనుంది. మండల, డివిజన్ స్టాటిస్టికల్ ఆఫీసర్లకు ఇది వరకే శిక్షణ సైతం అందించారు.
పక్కాగా నిర్వహిస్తాం..
జిల్లాలోని సాగునీటి వనరుల స్థితిగతులు, వాటి కింద సాగు విస్తీర్ణం గుర్తించేందుకు గాను కేంద్రం 7వ చిన్ననీటి వనరుల గణనను చేపడుతుంది. అక్టోబర్ 30వరకు గణన పూర్తి చేయాలని ఆదేశించింది. జిల్లాలో ఈ ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తాం. జిల్లా స్థాయిలో ఉద్యోగులకు ఇది వరకే శిక్షణ ఇచ్చాం. మండల స్థాయిలో త్వరలోనే ఎన్యూమరేటర్లకు శిక్షణ ఇచ్చి వర్షాలు తగ్గిన వెంటనే గణనను ప్రారంభిస్తాం.– బి.వెంకటరమణ,
ప్రణాళికశాఖ జాయింట్ డైరెక్టర్, ఆదిలాబాద్
జిల్లాలో గత గణనలో గుర్తించిన నీటి
వనరుల వివరాలు
బోర్‌వెల్స్ : 23,161
లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు : 575
చెరువులు : 464
తవ్వకపు బావులు : 7,615