
మళ్లీ తెరపైకి ‘సీసీఐ’
● పునరుద్ధరణపై ప్రభుత్వాల ఫోకస్ ● కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన రాష్ట్ర సర్కారు ● సాధ్యాసాధ్యాలపై కేంద్ర మంత్రి సమీక్ష ● సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం ● జిల్లావాసుల్లో చిగురిస్తున్న ఆశలు
చిత్తశుద్ధి నిరుపించుకోవాలి
సీసీఐని పునఃప్రారంభించాలనే డిమాండ్‌తో మూడేళ్లుగా విస్తృత పోరాటం చేస్తున్నాం. కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిని కలిసి విన్నవించాం. కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఫ్యాక్టరీ పునఃప్రారంభంపై సమీక్షించి డీపీఆర్ కోరడం హర్షనీయం. జిల్లాకు చెందిన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా చొరవ చూపాలి. ఎన్నికల హామీ మేరకు తమ చిత్తశుద్ధి నిరుపించుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి.
– విజ్జగిరి నారాయణ,
సీసీఐ సాధన కమిటీ కోకన్వీనర్
కైలాస్‌నగర్: జిల్లా కేంద్రంలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీ పునరుద్ధరణపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కేంద్రంలో కదలిక వచ్చినట్లుగా తెలుస్తోంది. పాతికేళ్ల క్రితం మూతపడ్డ ఈ ఫ్యాక్టరీలోని యంత్రాలు, సామగ్రిని స్క్రాప్ కింద విక్రయించేందుకు కేంద్రం టెండర్ల ప్రక్రియ సైతం చేపట్టిన విషయం తెలిసిందే. ఇక కనుమరుగేననే భావన వ్యక్తమవుతున్న తరుణంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమరస్వామి ఇటీవల సీసీఐ పునరుద్ధరణ సాధ్యాసాధ్యాలపై ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఈ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు సైతం సమావేశానికి హాజరు కావడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ నెలాఖరులోగా రాష్ట్రంలో పర్యటిస్తాననే కేంద్ర మంత్రి ప్రకటనతో ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంశం మరోసారి తెరపైకి వచ్చినట్లయింది.
ఇదీ పరిస్థితి..
జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం 1984లో ఈ సిమెంట్ ఫ్యాక్టరీని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా ప్రారంభించింది. 14 ఏళ్ల పాటు నడిచిన ఫ్యాక్టరీ ప్రత్యక్షంగా వందలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించింది. పరోక్షంగా వేలాది మంది జీవనోపాధికి తోడ్పడింది. అలాగే ఈ ప్రాంత వ్యాపార, వాణిజ్య అభివృద్ధికి ఎంతో దోహదపడింది. లాభాల బాటలో సాగుతున్న ఫ్యాక్టరీపై పాలకుల ఆశ్రద్ధ కారణంగా నష్టాలు మొదలయ్యాయి. ఈ సాకుతో 1998లో సిమెంట్ ఉత్పత్తిని నిలిపివేశారు. నాడు మూతపడ్డ ఫ్యాక్టరీ తిరిగి తెరచుకోలేదు. పునః ప్రారంభించాలంటూ నాటి నుంచి నేటి వరకు కార్మికులతో పాటు భూ నిర్వాసితులు, రాజకీయ పార్టీల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా వీటిని పట్టించుకోని కేంద్రం ఫ్యాక్టరీలోని యంత్రాలు, సామగ్రిని స్క్రాప్ కింద విక్రయించేందుకు ఈ ఏడాది మే నెలలో టెండర్లు ఆహ్వానించింది. వాటిని ఖరారు చేసే సమయంలో కార్మిక సంఘాలు జాతీయస్థాయిలో ఒత్తిడి తెచ్చేలా ఉద్యమించడంతో ఆ నిర్ణయంపై వెనక్కితగ్గింది. టెండర్ల ప్రక్రియను నిలిపివేసింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి
27 ఏళ్ల క్రితం మూతపడ్డ సిమెంట్ ఫ్యాక్టరీ ఇక చరిత్రకే పరిమితమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. ఈ క్రమంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి ఫ్యాక్టరీ పునరుద్ధరణ సాధ్యాసాధ్యాలపై ఈనెల 9న తన శాఖ అధికారులతో ఢిల్లీలో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. గతంలో సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఇందులో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొని ఫ్యాక్టరీ పునరుద్ధరణ అవశ్యకతను కేంద్ర మంత్రి, అధికారులకు వివరించారు. రాష్ట్ర సర్కారు సానుకూలంగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ విషయాన్ని ప్రస్తావించగా.. స్పందించిన కేంద్ర మంత్రి సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. త్వరలోనే రాష్ట్ర పర్యటనకు వచ్చి ప్రభుత్వ రంగ పరిశ్రమల పనితీరు సమీక్షించడంతో పాటు సీసీఐ పునరుద్ధరణ దిశగా చర్యలకు ప్రయత్నిస్తానని ప్రకటించడంపై జిల్లావాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఫ్యాక్టరీ పునరుద్ధరణకు అవసరమైన అన్ని వనరులు జిల్లాలో అందుబాటులో ఉన్నట్లుగా కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. ఉత్పత్తికి అవసరమైన యంత్రాలను సమకూర్చితే సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎంపీ, ఎమ్మెల్యే చొరవ కీలకం ..
సీసీఐ పునరుద్ధరణపై కేంద్ర, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రులు సానుకూలత వ్యక్తం చేసిన నేపథ్యంలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే చొరవ కీలకం కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతంంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తరఫునే ఇరువురు ప్రాతినిధ్యం వహిస్తుండటం, పలువురు కేంద్ర మంత్రులు, కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉండటం ఫ్యాక్టరీ విషయంలో కలిసోస్తుందనే చర్చ సాగుతుంది.

మళ్లీ తెరపైకి ‘సీసీఐ’