
సమగ్ర భూసర్వేతో సమస్యలు పరిష్కారం
● తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్
ఆదిలాబాద్‌అర్బన్: టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో భూ సమస్యలు తగ్గకపోగా మరింతగా పెరుగుతున్నాయని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ అన్నారు. సీఐటీయూ కార్యాలయంలో ‘భూ భారతి చట్టం భూ సమస్యలను పరిష్కరిస్తుందా..’ అంశంపై తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి ‘భూ భారతి’ చట్టా న్ని తీసుకొచ్చిందని, రెవెన్యూ సదస్సుల ద్వారా కోటి 40 వేల దరఖాస్తులు స్వీకరించగా, అందులో 70 శాతం భూ సమస్యలకు సంబంధించినవే ఉన్నట్లు తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ‘ధరణి’ పోర్టల్ తీసుకురాగా, కాంగ్రెస్ ప్రభుత్వం ‘భూ భారతి’ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు. దరఖాస్తు దారులందరికీ పట్టా దార్ పాస్‌బుక్‌లు ఇవ్వడం ద్వారా సమస్యలు పరి ష్కారం కావన్నారు. భూ రికార్డుల అస్తవ్యస్తతతో రైతులు అసలు యాజమాన్య హక్కులను నిరూపించుకోలేక పోతున్నారని విమర్శించారు. శాశ్వత పరి ష్కారం కావాలంటే సమగ్ర భూసర్వే అవసరమన్నారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.పద్మ, జిల్లా నాయకులు లంకా రాఘవులు, బండి దత్తాత్రి, ఎన్.స్వామి, డి.స్వామి, గంగారాం, ఆశన్న, పొచ్చన్న, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.