
లోటు దిశగా..
● జిల్లాలో వర్షపాతం తీరిది ● పది రోజుల క్రితం రాష్ట్రంలోనే ‘అధిక’ం ● తాజాగా ముఖం చాటేసిన వరుణుడు ● నీటి వసతి లేని పంటలకు తిప్పలు
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో వర్షపాతం అధికం నుంచి లోటువైపు పయనిస్తుంది. పది రోజుల క్రితం రాష్ట్రంలోనే అధిక వర్షపాతంతో మొదటి స్థానంలో నిలిచిన జిల్లా ప్రస్తుతం లోటు వైపు వెళ్తుంది. ఈ పరిస్థితుల్లో నీటి వసతి ఉన్న వారు ఎదుగుతున్న పంటకు స్ప్రింక్లర్ల ద్వారా నీటిని అందిస్తుండగా, మిగతా రైతులు వరుణుడే దిక్కు అని ఆకాశం వైపు చూస్తున్నారు. ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం జిల్లాలో స్వల్ప వాన కురిసినప్పటికీ అది పూర్తిస్థాయిలో ఊరట ఇవ్వలేకపోయింది. ఈ వానకాలం సీజన్ రైతులతో దోబూచులాట ఆడుతుంది. సీజన్ ప్రారంభానికి ముందు మస్తుగా వర్షాలు కురువడంతో రైతులు సాగు పనులు ముందే షురూ చేశారు. ఆ తర్వాత జూన్ మొదటి వారం మృగశిరకార్తే ప్రవేశం తర్వాత అధిక సంఖ్యలో రైతులు సాగుకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత వర్షాలు లేకపోవడంతో కొంత మంది రైతులు మళ్లీ రెండోసారి విత్తనాలు విత్తాల్సిన పరిస్థితి. జూన్ చివరి వారంలో మంచి వర్షాలు కురువడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జిల్లాలో సాధారణ నుంచి అధిక వర్షపాతంకు చేరుకుంది. మళ్లీ జూలైలో పరిస్థితులు తారుమారయ్యాయి. పది రోజులుగా చినుకు రాలకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధానంగా పంట ఎదిగే దశలో నీటి తడులు అందించాల్సి ఉండగా వర్షాలు లేకపోవడంతో హైరానా పడుతున్నారు. పరిస్థితి మరికొద్ది రోజులు ఇలాగే కొనసాగితే పంట నష్టం తప్పదన్న ఆవేదన వారిలో కనిపిస్తుంది. ఇక నీటి వసతి ఉన్నవారు పంటలకు స్ప్రింక్లర్ల ద్వారా తడులు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికీ జిల్లాలోని పలు మండలాల్లో లోటు వర్షపాతం నెలకొంది.
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి..
జిల్లాలో మారిన వాతావరణ పరిస్థితులతో జనం ఆందోళన చెందుతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మళ్లీ వేసవి నాటి పరిస్థితులు కనిపించడంతో ఇదేమి కాలంరా బాబోయ్ అంటూ నిట్టూరుస్తున్నారు. మళ్లీ ఏసీలు, కూలర్లకు పనిచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జిల్లాలో వర్షపాతం
(జూన్ 1 నుంచి జూలై 21 వరకు..)
సాధారణం : 419.9 మి.మీ.
కురిసింది : 401.0 మి.మీ.
వ్యత్యాసం : 5 శాతం తక్కువ
స్థితి : సాధారణం