
టెండర్ లేకుండానే..
బ్లీచింగ్ పౌడర్, పటిక కొనుగోళ్లు
● బల్దియాలో నిబంధనలకు తిలోదకాలు ● ఇంజినీరింగ్ విభాగం అధికారుల తీరుపై విమర్శలు
కైలాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగంలో అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు. 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన పనుల్లో అక్రమాలు మరువకముందే తాజాగా బ్లీచింగ్ పౌడర్, పటిక కొనుగోళ్లలోనూ అదేతీరు ప్రదర్శించ డం అనుమానాలకు తావిస్తోంది.టెండర్లు లేకుండా దొడ్డిదారిన వాటిని కొనుగోలు చేసిన అధికారులు లక్షలాది రూపాయల బిల్లులు స్వాహా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకాధికారి పట్టించుకోకపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతోనే వీరి అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదీ పరిస్థితి ..
ఆదిలాబాద్ పట్టణానికి మిషన్ భగీరథతో పాటు జిల్లా కేంద్రం శివారులోని లాండసాంగ్వీ, మావల చెరువు నుంచి నీటి సరఫరా ఉంటుంది. ఈ రెండు వనరుల నుంచి నీరు కలెక్టరేట్ పక్కన గల ఫిల్టర్‌బెడ్‌కు చేరుతుంది. అక్కడ శుద్ధి చేసి పట్టణంలోని ఆయా వార్డులకు సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో నీటి శుద్ధికోసం బ్లీచింగ్ పౌడర్, పటిక వినియోగిస్తారు. వీటి కొనుగోలుకు మున్సిపల్ అధికారులు ఏటా టెండర్లు ఆహ్వానిస్తారు. తక్కువ ధరకు కోట్ చేసిన వారికి సరఫరా బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇలా ప్రతీ సీజన్‌కు సుమారు రూ.50లక్షల నుంచి రూ.కోటి వరకు వెచ్చిస్తుంటారు. అయితే ఇక్కడే ఇంజినీరింగ్ విభాగం అధికారులు నిబంధనలకు తూట్లు పొడిచి తమ జేబులు నింపుకునే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఏం జరిగిందంటే...
నిబంధనల ప్రకారం బ్లీచింగ్ పౌడర్, పటిక కొనుగోలుకు టెండర్లు ఆహ్వానించాలి. పత్రికల ద్వారా నోటిఫికేషన్ ప్రకటించాలి. తక్కువ ధరకు కోట్ చేసిన వారికి సరఫరా బాధ్యతలు అప్పగించాలి. అయితే ఈ సారి ఇవేమి పాటించ లేదు. బల్దియా ఇంజినీరింగ్ విభాగంలోని ఓ కీలక అధికారి టెండర్లకు పాతరేస్తూ ఇష్టారాజ్యంగా దాదాపు రూ.20 లక్షల విలువైన బ్లీచింగ్ పౌడర్, పటికను కొనుగోలు చేశారని తెలుస్తోంది. గుట్టుగా ఈ ప్రక్రియ చేపట్టిన సదరు అధికారి తీరుపై బల్దియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
● ఈ విషయమై మున్సిపల్ ఇంజినీర్ పేరి రాజును పలుమార్లు ఫోన్‌లో సంప్రదించగా ఆయన కట్ చేయడం గమనార్హం.
● ఇదే విషయమై మున్సిపల్ కమిషనర్ సీవీఎన్.రాజును సంప్రదించగా ప్రభుత్వరంగ సంస్థ అయిన హాకా నుంచి బ్లీచింగ్ పౌడర్, పటిక కొనుగోలు చేశామని తెలిపారు. అయితే ఎంత విలువైన సరుకు కొనుగోలు చేశారు.. ఎక్కడి నుంచి తెప్పించారనే దానిపై అడుగగా ఆ వివరాలేవీ తనకు తెలియవని మున్సిపల్ ఇంజినీర్‌ను అడగాలని పేర్కొనడం గమనార్హం.
విచారించి చర్యలు తీసుకుంటాం
మున్సిపల్ పరిధిలో ఎలాంటి టెండర్లు నిర్వహించకుండా బ్లీచింగ్ పౌడర్, పటికను కొనుగోలు చేశారనే విషయం ఇప్పటి వరకు నా దృష్టికి రాలేదు. విచారణ చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
– ఖుష్బూగుప్తా, మున్సిపల్ ప్రత్యేకాధికారి