
‘టీబీ ముక్త్’పై ఫోకస్
● వ్యాధిగ్రస్తులపై నిత్యం ఆరా ● ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నంబర్ ● మందులు వేసుకోవడంపై పర్యవేక్షణ
ఆదిలాబాద్‌టౌన్: క్షయ నిర్మూలనపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. టీబీ ముక్త్ భారత్‌లో భాగంగా వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు మందులు వేసుకుంటున్నారా..లేదా అనే విషయాలపై ఆరా తీస్తోంది. మెడిసిన్ వేసుకున్న తర్వాత టోల్‌ఫ్రీ నంబర్‌కు మిస్‌కాల్ ఇచ్చేలా చర్యలు చేపడుతున్నారు. బాధితుడు 18003137957 నంబర్‌కు మిస్‌కాల్ ఇస్తే ఆన్‌లైన్‌లో వివరాలు నమోదవుతాయి. ఇక మందులు వేసుకోని వారిని ఫోన్ ద్వారా, నేరుగా సంప్రదించి అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. టీబీ నియంత్రణ అధికారులతో పాటు మండల, జిల్లా రాష్ట్ర, జాతీయస్థాయి వరకు వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షిస్తుండడంతో వ్యాధిగ్రస్తుల చికిత్స వివరాలు తెలియనున్నాయి.
జిల్లాలో..
జిల్లాలో వ్యాధిగ్రస్తులు 1,003 మంది ఉన్నారు. వీరి కి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. తీవ్ర త బట్టిమెడిసిన్ వినియోగించాల్సి ఉంటుంది. ఆరు నెలల వరకు చికిత్స పొందితే క్షయ నయమవుతుంది. వ్యాధి ముదిరిన వారు మాత్రం 9 నెలల నుంచి 18 నెలల వరకు మందులు వాడాల్సి ఉంటుంది. వ్యాధిగ్రస్తులు ఒకేసారి ఐదు మాత్రలు వేసుకోవా ల్సి ఉంటుంది. కొంత మంది ఒకేసారి కాకుండా వేర్వేరుగా వేసుకోవడంతో ఫలితం కనిపించదని వైద్యులు చెబుతున్నారు. ఈ మందులను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఇదిలా ఉండగా టీబీ సోకితే పది రకాల లక్షణాలు కనిపిస్తాయి. దగ్గు, జ్వరం, ఆయాసం, నీరసం, ఛాతిలో నొప్పి, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, రాత్రిపూట చె మటలు పట్టడం, దగ్గినప్పుడు రక్తం పడటం, మెడ, గజ్జలు, సంకలో గడ్డలు వంటివి కనిపిస్తాయి. ఇలాంటి వారు సమీపంలోని ఆస్పత్రిలో వైద్యులను సంప్రదించాలని అధికారులు చెబుతున్నారు.
టీబీ నివారణకు ప్రత్యేక చర్యలు..
జిల్లాలో టీబీ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. వ్యాధిగ్రస్తులు మందులు వేసుకున్న తర్వాత టోల్‌ఫ్రీ నంబర్‌కు మిస్‌కాల్ చేస్తే మందులు వేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ వివరాలను కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారులకు తెలుస్తుంది. వైద్యుల సూచన మేరకు మందులు వాడితే వ్యాధి పూర్తిస్థాయిలో నయమవుతుంది.
– డాక్టర్ సుమలత,
టీబీ నియంత్రణ జిల్లా అధికారి