● ఆదివాసీ సంస్కృతిని కాపాడుకోవాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్
ఇంద్రవెల్లి: ఆదివాసీ గ్రామాల్లోని రాయిసెంటర్ వ్యవస్థ పనితీరు అభినందనీయమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలోని గిన్నెర గ్రామంలో రాయిసెంటర్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సమావేశానికి ఏఎస్పీ కాజల్‌సింగ్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. ఆదివాసీలతో మాట్లాడి వారి జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. రాయిసెంటర్ వ్యవస్థలో భాగంగా గ్రామాల్లోనే ఆదివాసీ పెద్దలు చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడం అభినందనీయమన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూనే పిల్లల చదువుపై దృష్టి సారించాలన్నారు. గంజాయి సాగుకు దూరంగా ఉండాలన్నారు. అలాగే మద్యం తాగి వాహనాలు నడుపొద్దన్నారు. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్యులను సంప్రదించాలే తప్ప బాబాలను మంత్రగాళ్లను ఆశ్రయించవద్దన్నారు. బాల్య వివాహ వ్యవస్థ రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ముందుగా రాయిసెంటర్ సార్‌మేడీలు, ఆయా గ్రామ పటేళ్ల ఆధ్వర్యంలో ఎస్పీని సన్మానించారు. కార్యక్రమంలో ఉట్నూర్ సీఐ మడావి ప్రసాద్, ఎస్సై సాయన్న, రాయిసెంటర్ జిల్లా మేడి మెస్రం దుర్గు, ఆదివాసీ పెద్దలు సిడాం భీంరావ్, ఆర్క ఖమ్ము తదితరులు పాల్గొన్నారు.
‘రాయిసెంటర్’ పనితీరు అభినందనీయం