
వీడిన హిజ్రా హత్యకేసు మిస్టరీ
ఉట్నూర్‌రూరల్: ఉట్నూర్ పోలీసు సబ్ డివిజన్ పరిధిలోని ఇంద్రవెల్లిలో ఇటీవల జరిగిన హిజ్రా హత్య కేసు మిస్టరీ వీడింది. బుధవారం రాత్రి ఉట్నూర్ పోలీసు సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ కాజల్‌సింగ్ వివరాలు వెల్లడించారు. జాదవ్ అర్జున్, ఆయు (అరుణ) నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోమని ఆయు వెంటపడుతుండడంతో కాలయాపన చేస్తూ వస్తున్నాడు. ఈనెల 8న పథకం ప్రకారం ఆయును అడవిలోకి తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. మత్తులో ఉన్న ఆయు తలపై కొట్టి చెట్టుకు ఉరివేసి ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించాడు. మృతిపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేయడంతో ఉట్నూర్ సీఐ మడావి ప్రసాద్ ఆధ్వర్యంలో ఇచ్చోడకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ అర్జున్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలిస్తున్నామని ఏఎస్పీ వివరించారు. సమావేశంలో సీఐ మడావి ప్రసాద్, ఎస్సైలు సాయన్న, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.