
రౌడీలూ.. తీరు మారాలి!
● కొరడా ఝళిపిస్తున్న పోలీసులు ● రంగంలోకి స్పెషల్ బృందాలు ● పద్ధతి మార్చుకోకుంటే నగర బహిష్కరణ ● జిల్లాలో 234 మందికి హెచ్చరిక
మంచిర్యాలక్రైం: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో రౌడీషీటర్ల ఆగడాలపై పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా నిఘా పెంచారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 234 మందిపై రౌడీషీట్లు ఉన్నా యి. జిల్లాలో ఇటీవల రౌడీషీటర్ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. అంబర్ కిషోర్ ఝా బాధ్యతలు తీసుకున్న తర్వాత రౌడీ షీటర్లు, గంజాయి విక్రేతలు, పాత నేరస్తుల ఆట కట్టించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రత్యేకంగా స్పెషల్ పార్టీ బృందాలను రంగంలోకి దింపారు. ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలోని నిఘా వర్గాల ద్వారా రౌడీ షీటర్లు చేస్తున్న పనులపై ఆరా తీస్తున్నారు.
ప్రత్యేక బృందాలు ఏర్పాటు..
రౌడీషీటర్ల ఆగడాలు, గంజాయి పాత నేరస్తుల అల్లర్లను అరికట్టేందుకు రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా 30మంది ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు చేశారు. అక్రమ దందాలు, సెటిల్‌మెంట్లు, గ్యాంగ్ దాడులు నిర్వహించే రౌడీ షీటర్ల ప్రభావం ఉండే ప్రాంతాల్లో సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. తమకు తాముగా మారితేనే రౌడీషీట్ తొలగిస్తామని, లేకుంటే పీడీయాక్ట్, నగర బహిష్కరణ చేస్తామని ఇప్పటికే పలువురు రౌడీ షీటర్లకు హెచ్చరికలు పంపారు. అమయాక ప్రజలను బెదిరింపులకు గురిచేస్తున్న రౌడీషీటర్ల జాబితా సిద్ధం చేసి ఆయా పోలీస్‌స్టేషన్లకు అందించారు. వీరి ఇళ్లపై డీసీపీ భాస్కర్ పర్యవేక్షణలో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేస్తూ వారి కదలికలపై నజర్ పెడుతున్నారు.
రాజకీయ రంగు..
రౌడీషీటర్లు మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, తాండూర్, పెద్దపెల్లి జిల్లాల్లోని గోదావరిఖని, మంథని, ఎన్‌టీపీసీ పరిసర ప్రాంతాల్లో రియల్, వ్యాపార లావాదేవిల్లో, భూ వివాదాల్లో ఇటీవల రౌడీషీటర్ల జోక్యం పెరిగింది. కాగా కొంతమంది రౌడీషీటర్లను రాజకీయ నాయకులే పెంచి పోషిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా పోలీస్ రికార్డుల్లో రౌడీ షీటర్లుగా గుర్తింపు పొందిన వారి ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేందుకు పోలీస్ ఉన్నతాధికారులు తరుచుగా రౌడీ షీటర్లు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
ఇలా చేస్తే రౌడీషీటే..
● కుట్రపూరితమైన ఆలోచనతో భూవివాదాల్లో జోక్యం చేసుకోవడం, దాడికి దిగడం. అల్లర్లు చేయడం.
● పంచాయతీల్లో తలదూర్చడం, దాడులు, కొట్లాటలు వంటి సంఘటనల్లో తరుచుగా పాలుపంచుకోవడం.
● సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడం.
● ఆడవాళ్లను తరుచూగా వేధింపులకు గురిచేయడం.
● నిత్యం నేరపూరితమైన సంఘటనలకు పాల్పడడం.
మంచిర్యాల జిల్లాలో
డివిజన్ల వారీగా రౌడీషీటర్లు..
మంచిర్యాల 82
జైపూర్ 31
బెల్లంపల్లి 121
నిరంతరం నిఘా..
రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు గ్యాంగ్ దాడులకు పాల్పడుతున్న వారిపై, పాత నేరస్తులు, రౌడీషీట్, గంజాయి నిందితులపై నిరంతరం నిఘా ఉంచాం. రౌడీ షీటర్లు వారి పద్ధతి మార్చుకోకపోతే నగర
బహిష్కరణ చేస్తాం.
– ఎగ్గడి భాస్కర్, డీసీపీ, మంచిర్యాల

రౌడీలూ.. తీరు మారాలి!

రౌడీలూ.. తీరు మారాలి!