
పెళ్లిపీటలు ఎక్కాలని వచ్చి... పాడెక్కాడు..
ఖానాపూర్:పెళ్లి చేసుకునేందుకు ఎన్నో ఆశలతో అతను ఇటీవలే గల్ఫ్ నుంచి స్వదేశానికి తిరిగొచ్చాడు. ఈనెల 18న పెళ్లి కూడా నిశ్చయమైంది. ఎంతో సంతోషంతో పెళ్లి శుభలేఖలు పంచేందుకు తన బావమరిదితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృతిచెందిన ఘటన ఆదివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో చోసుచేసుకుంది. సీఐ సీహెచ్ అజయ్, ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్‌పల్లి గ్రామానికి చెందిన చొప్పదండి లక్ష్మణ్(25)కు కడెం మండలం పెద్ద బెల్లాల్ పంచాయతీపరిధి ఎస్సీకాలనీకి చెందిన యువతితో ఇటీవల వివాహం నిశ్చయమైంది. ఈ నెల 18న వివాహం ఉండడంతో ఆదివారం నిర్మల్ జిల్లా లక్ష్మణచాందలో శుభలేఖలు పంచేందుకు జన్నారం మండలం మురిమడుగు గ్రామానికి చెందిన మేన బావమరిది పడిగెల జశ్వంత్(19)తో కలిసి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. ఈక్రమంలో ఖానాపూర్ పట్టణంలోని కుమురంభీం చౌరస్తా సమీపంలో వాహనం అదుపుతప్పి కల్వర్టు వద్ద కాలువలో పడ్డారు. దీంతో ఇద్దరి తలలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఖానాపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. జశ్వంత్ తల్లి భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా లక్ష్మణ్ పెళ్లి చేసుకునేందుకు ఇటీవలే గల్ఫ్ నుంచి వచ్చాడు.
వివాహం కోసం గల్ఫ్ నుంచి వచ్చిన యువకుడు
శుభలేఖలు పంచేందుకు వెళ్తుండగా ప్రమాదం
వరుడుతోపాటు బావమరిది దుర్మరణం
రెండు కుటుంబాల్లో విషాదం

పెళ్లిపీటలు ఎక్కాలని వచ్చి... పాడెక్కాడు..

పెళ్లిపీటలు ఎక్కాలని వచ్చి... పాడెక్కాడు..