
నిమ్స్‌లో గిరిజన బాలికకు మంత్రి పరామర్శ
లక్డీకాపూల్: అనారోగ్యంతో బాధపడుతున్న గిరిజ న విద్యార్థిని ఆత్రం త్రివేణిని హైదరాబాద్‌లోని నిమ్స్‌లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం పరామర్శించారు. త్రి వేణి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని మంత్రి ఆదేశించారు. ఆయన వెంట గిరిజన సంక్షేమ శా ఖ కార్యదర్శి ఎ.శరత్, అదనపు సంచాలకులు వి.సర్వేశ్వర రెడ్డి, ఉప సంచాలకులు దిలీప్ పాల్గొన్నారు.
తలపై కర్ర పడడంతో..
త్రివేణి ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుంటాల గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతుంది. ఆమె తండ్రి తులసీరాం తెలిపిన వివరాల ప్రకారం.. వేసవి సెలవుల్లో త్రివేణి తలపై కర్ర పడటంతో ఆమెకు గాయమవడంతో పాటు వాంతులతో సతమతమైంది. స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా మందులు ఇవ్వడంతో వాంతులు ఆగిపోయాయి. ఈ క్రమంలో గత నెల20 నుంచి పాఠశాల ప్రారంభం కాగా వెళ్లింది. ఈ నెల11న నైట్ స్టడీ సమయంలో ఆమె వాంతులు చేయడంతో పాటు తీవ్రమైన తలనొప్పితో బాధపడింది. దీంతో ఆమెను పాఠశాల సిబ్బంది నేరడిగొండ పీహెచ్‌సీకి, మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ నెల12న నిర్మల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా ఆమె మెదడులో రక్తం గడ్డకట్టినట్టు వైద్యులు గుర్తించారు. మెరుగైన వైద్య చికిత్సకు నిమ్స్‌కు రిఫర్ చేశారు.