
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
తానూరు: మండలంలోని బోంద్రట్ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగినట్లు ఎస్సై షేక్ జుబేర్ తెలిపారు. ఎస్సై, బాధితులు తెలిపిన వివరాలు.. బోంద్రట్ గ్రామానికి చెందిన జంగ్మే సావిత్రిబాయి –నారాయణ దంపతులు ఆదివారం ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనులకు వెళ్లారు. వ్యవసాయ పనులు ముగించుకుని సాయంత్రం ఆరు గంటలకు తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి ఉన్న తాళం పగులగొట్టి ఉండడం.. బీరువా తెరిచి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై షేక్ జుబేర్ అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. బీరువాలో నగదుతో పాటు బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు.
విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి
సాత్నాల: విద్యుదాఘాతానికి గురై బావునే అశోక్ (56) అనే వ్యక్తి మృతిచెందిన సంఘటన భోరజ్ మండలం పెండల్వాడ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై గౌతమ్ పవర్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి కుటుంబ సభ్యులందరు భోజనం చేసి పడుకున్నారు. అశోక్ ముందురూమ్‌లో పడుకున్నాడు. అశోక్ కుమారుడు రవి రాత్రి 11 గంటల సమయంలో బాత్‌రూం వెళ్లేందుకు నిద్ర లేచాడు. అశోక్ రెండు కాళ్లు కూలర్ స్టాండ్‌కు తగిలి ఉన్నాయి. అనుమానం వచ్చిన రవి కరెంట్ ఆఫ్ చేసి చూడగా అశోక్ కరెంట్ షాక్‌తో మృతిచెంది ఉన్నాడు. రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గౌతమ్ పవర్ తెలిపారు.