
ఆలయాన్ని అభివృద్ధి చేసి తీరుతాం
● వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి ● పర్యాటకంగానూ తీర్చిదిద్దుతాం ● మంత్రులు కొండా సురేఖ, వివేక్ ● బాసర ఆలయంలో ప్రత్యేక పూజలు ● ధర్మశాల పునరుద్ధరణ ప్రారంభం ● ట్రిపుల్‌ఐటీ కళాశాల సందర్శన
భైంసా/బాసర: బాసర శ్రీజ్ఞానసరస్వతీ ఆలయాన్ని నభూతో న భవిష్యత్ అన్న రీతిలో అభివృద్ధి చేసి తీరుతామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు. శనివారం కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సురేఖ సరస్వతీ అమ్మవారి ప్రాశస్త్యాన్ని వివరించారు. బాసర అభివృద్ధికి డీపీఆర్ సిద్ధం చేశామని చెప్పారు. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదంతో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఆలయ అభివృద్ధిని విస్మరించిందని ఆరోపించారు. బాసర ఆలయ అభివృద్ధికి అవసరమై కేంద్రం నిధులు రాబట్టేందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీల సహకారం తీసుకుంటామని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతోనూ చర్చించి పర్యాటకంగా బాసర క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులిచ్చి అందులో రూ.8 కోట్లే ఖర్చు చేసి మిగతా వాటిని వెనక్కి తీసుకుందని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం వెనక్కి వెళ్లిన నిధులు విడుదల చేయాలని కోరారు.
పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
బాసర సరస్వతీ అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులను నాలుగు భాగాలుగా కేటాయించి రూపొందించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను కలెక్టర్ అభిలా ష అభినవ్, దేవాదాయ శాఖ అధికారులు ప్రదర్శించారు. మొదటిభాగంలో అమ్మవారి ఆలయ విస్తరణ, క్యూకాంప్లెక్స్‌లు, గర్భగుడి విస్తరణ, చుట్టూ ప్రాకారాల నిర్మాణాలు ప్రదర్శించారు. పక్కనే గుట్ట పై మరో వంద గదుల సత్రం, 300 కార్లు నిలిపేలా పార్కింగ్ స్థలంతో నమూనాను సిద్ధం చేశారు. రెండవ ప్రదర్శనలో బాసర గోదావరినదికి వెళ్లే మార్గంలో అమ్మవారి ఆలయానికి సంబంధించిన ఎని మిది ఎకరాల్లో 50 అడుగుల సరస్వతీ ఆలయం, లేజర్ ప్రదర్శన, భక్తులు సేద తీరేలా డార్మెంటరీ నిర్మాణం చేపట్టేలా, రాత్రి వేళ ప్రదర్శనలు ఇచ్చేలా నమూనాలు రూపొందించారు. ఇక అమ్మవారి ఆలయానికి ఆదాయం వచ్చేలా ఓ కన్వెన్షన్ హాల్ నిర్మించేలా ప్రతిపాదించారు. పలు ప్రైవేట్ కంపెనీల స మావేశాలు, వివాహాలు, శుభకార్యాల నిర్వహణపై వచ్చే ఆదాయం పెరిగేలా నమూనా వేశారు. మూ డో ప్రదర్శనలో బాసర గోదావరినది తీరంలో అమ్మవారి ఆలయానికి సంబంధించి మరో 20 ఎకరాలకుపైగా భూములున్నాయి. ప్రస్తుతం నది ఒడ్డు నే పిండ ప్రదానం, పక్కనే శివాలయం, అటు పక్క నే అల్పహారాల విక్రయ కేంద్రాలు కనిపిస్తుంటా యి. అలా కాకుండా పిండ ప్రదానాలకు వేరే చోట నిర్మాణాలు, శివాలయాన్ని విస్తరించడం, సువిశాలంగా ఉన్న స్థలాన్ని అందంగా తీర్చిదిద్దితే గోదావ రి నది దృశ్యాలు ఆహ్లాదం పంచేలా నిర్మాణాలు చేపట్టే నమూనాను వివరించారు. నాలుగో ప్రదర్శనలో బాసర రైల్వేస్టేషన్ సమీపంలో ఆలయానికి సంబంధించిన భూమిలో సిబ్బంది, ఉద్యోగులకు వసతి సౌకర్యంతోపాటు భక్తులకు విశ్రాంతి భవనం నిర్మించేలా నమూనా రూపొందించారు. ప్రైవేట్ వాహనాలు నిలిపి భక్తులను అమ్మవారి క్షేత్రానికి తరలించేలా.. ఆన్‌లైన్‌లో వెహికిల్ బుకింగ్ చేసుకునేలా కౌంటర్లు ఏర్పాటు చేయాలని నమూనాలో వివరించారు. రైలు మార్గం ద్వారా వచ్చే భక్తులు అక్కడే విశ్రాంతి తీసుకునేలా ఏర్పాట్లు చేయాలని ఇందులో చర్చించారు.
ట్రిపుల్‌ఐటీలో మొక్కలు నాటి..
వనమహోత్సవంలో భాగంగా బాసర ట్రిపుల్‌ఐటీలో అటవీశాఖ మంత్రి కొండా సురేఖ మొక్కలు నాటారు. అనంతరం కాన్ఫరెన్స్ హాల్‌లో ఆమె మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ బాసరలో ట్రిపుల్‌ఐటీ నెలకొల్పడంతోనే ఇప్పుడు వేలాది మంది విద్యార్థులకు విద్య, ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయన్నారు. సమస్యలపై కలెక్టర్ నివేదిక పంపితే సీఎంతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్‌ఐటీ అభివృద్ధికి నిధులివ్వాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ అభిలాష అభినవ్, ట్రిపుల్‌ఐటీ వీసీ గోవర్ధన్, ఎస్పీ జానకీ షర్మిల, మాజీ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, నారాయణరావుపటేల్, వేణుగోపాలాచారి పాల్గొన్నారు.
నిరాహార దీక్షకు దిగుతా..
బాసర అమ్మవారి ఆలయ అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆరోపించారు. మాస్టర్ ప్లాన్ అమలుపై తమకు మళ్లీ నిరాశే మిగిలిందన్నారు. ఆలయ గర్భగుడి, ఇతర అభివృద్ధి పనుల విషయంలోనూ ప్రభుత్వంతోపాటు మంత్రులను పలుసార్లు కలిశాన ని, అసెంబ్లీలోనూ ప్రస్తావించానన్నారు. వచ్చే దసరా, దీపావళి వరకై నా నిధులిచ్చి అభివృద్ధి చేయాలని కోరారు. లేని పక్షంలో తాను అమ్మవారి ఆలయం ఎదుట నిరాహార దీక్షకు దిగుతానని తెలిపారు. ప్రభుత్వం నిధులివ్వకుంటే భిక్షమైత్తెనా ఆలయాన్ని బాగు చేసుకుంటామని చెప్పారు. ఆలయానికి బెంగళూర్‌కు చెందిన ఓ దాత రూ.4 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే ప్రకటించారు.

ఆలయాన్ని అభివృద్ధి చేసి తీరుతాం