
పుస్తక పఠనం అలవర్చుకోవాలి
సాత్నాల: విద్యార్థులు పుస్తకాలు చదవడం అలవర్చుకోవాలని, పుస్తక పఠనమే భవిష్యత్‌లో అగ్రగణ్యులుగా నిలుపుతుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. భోరజ్ మండలం పిప్పర్‌వాడలోని అభ్యుదయ పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కవి బి.మురళీధర్ రచించిన ‘మౌనం ఎరుపు’ పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించగా ఇటీవల హిందీలోకి అనువాదమైన మోర్ పంకిపేడ్ పుస్తకాన్ని పాఠశాల యాజమాన్య సభ్యులు రాధాకృష్ణ, వెంకటరమణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు పఠానసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. నేటి ఆధునిక ప్రపంచంలో డిజిటలైజేషన్ ద్వారా ఎన్నో రకాల సాహిత్యం, రచనలు అందుబాటులోకి వచ్చినప్పటికీ భౌతికంగా ఒక పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని చదివేటప్పుడు కలిగే అనుభూతి అనిర్వచనీయమన్నారు. జిల్లా సంస్కృతి, భౌగోళిక విశిష్టతను ప్రతిబింబించే సాహిత్యాన్ని ప్రతి ఒక్కరూ చదవాలన్నారు. పీఎం శ్రీ పాఠశాలల్లో ప్రత్యేక గ్రంథాలయాలు ఏర్పాటు చేసి జిల్లా కవుల రచనలు కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రముఖ నవలా రచయిత వసంత్రా దేశ్‌పాండే అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పుస్తక రచయిత బి.మురళీధర్, విజయ డెయిరీ జనరల్ మేనేజర్ మధుసూదన్‌రావు, అభ్యుదయ పాఠశాల యాజమాన్య సభ్యులు సర్సన్ వెంకట్‌రెడ్డి, రచయితలు రాజవర్ధన్, మన్నె ఏలియా, చిందం ఆశన్న, చరన్‌దాస్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టర్ రాజర్షి షా