
ప్రతీ కేసులో సీఐ స్థాయి పర్యవేక్షణ ఉండాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌టౌన్: ప్రతీ కేసులో సీఐ అధికారి పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ శనివారం సర్కిల్ అధికారితో కోర్టు డ్యూటీ అధికారులు సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. కోర్టుకు హాజరు కాని నిందితులకు నాన్‌బెయిల్ వారెంట్ వచ్చేవిధంగా చూడాలన్నారు. కేసుల దర్యాప్తు పురోగతిపై పర్యవేక్షించాలన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన కోర్టు డ్యూటీ అధికారులకు నగదుతో పాటు ప్రశంస పత్రాలు అందజేస్తామన్నారు. నేరస్తులకు శిక్ష పడుతున్న సందర్భంలో సమాజం సన్మార్గం వైపు పయనించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, కోర్టులో శిక్ష పడే విధంగా కృషి చేయాలన్నారు.
హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్సైలకు ప్రత్యేక శిక్షణ
జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్‌లలో దర్యాప్తు చేస్తున్న హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సైలతో జిల్లా కేంద్రంలోని హెడ్‌క్వార్టర్స్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వీలైనంత వరకు కేటాయించిన కేసుల్లో సక్రమంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. పార్ట్–1, పార్ట్–2, సీజర్, పంచనామాలు నిర్వహించి దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఇన్‌స్పెక్టర్లు ప్రేమ్‌కుమార్, గుణవంత్‌రావు, అంజమ్మ, కోర్టు లైజన్ అధికారులు, కోర్టు డ్యూటీ అధికారులు, ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.