
అమ్మానాన్నల కష్టమే నాకు దారి చూపింది
– గడ్డం రమ్య, జైనథ్, ఎస్‌హెచ్‌వో
కుటుంబ నేపథ్యం..: స్వగ్రామం నిజా మాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని దేగామ. నాన్న భోజన్న వ్యవసాయ కూలీ. అమ్మ పద్మ బీడీ కార్మికురాలు.
విద్యాభ్యాసం: 10వ తరగతి వరకు జెడ్పీఎస్‌ఎస్ దేగామలో చదివా. బాసర ట్రిపుల్‌ఐటీలో రెండేళ్లు చదివాను. ఆ తర్వాత ఓపెన్ డిగ్రీ బీఏ(ఈపీపీ) చేశా. నిజాం కళాశాలలో ఎంఏ పూర్తి చేశాను.
లక్ష్యసాధన : 2021 నుంచి గ్రూప్స్‌కు ప్రిపేర్ అయ్యాను. పేద కుటుంబం కావడంతో ఆర్థిక పరిస్థితులు బాగా లేకుండే. అన్నయ్య చదువుతూనే హైదరాబాద్‌లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ తమ్ముడిని, నన్ను చదివించారు. అమ్మ నాన్నల కష్టమే నాకు దారి చూపించింది. గ్రూప్స్ ప్రిపరేషన్‌లో భాగంగా పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది. ఎస్సై, కానిస్టేబుల్ రెండింటికీ ఎంపికయ్యా. ఎస్సై ఉద్యోగం ఎంచుకున్నాను.
సమాజంలో మీరు కోరుకునే మార్పు..: పోలీసుస్టేషన్‌కు రావడానికి చాలామంది భయపడుతుంటారు. వారికి అవగాహన కల్పించి న్యాయపరమైన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తాను. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాను.
నిరుద్యోగులకు మీరిచ్చే సూచన..: కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు. గమ్యం చేరేంత వరకు వదిలిపెట్టద్దు.