జూకీపర్ను చంపి పీక్కుతిన్న సింహాలు
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో బుధవారం ఘోరం జరిగింది. అక్కడి ప్రముఖ జూలో పని చేసే వ్యక్తి(58)ని సింహాల గుంపు చంపి పీక్కుతింది. పర్యాటకులంతా చూస్తుండగానే ఇదంతా జరడం గమనార్హం. బ్యాంకాక్ పోస్ట్ కథనం ప్రకారం.. జియన్ రంగ్‌ఖరాసమీ అనే వ్యక్తి ఇరవై ఏళ్లుగా బ్యాంకాక్ సఫారీ వరల్డ్‌లో పని చేస్తున్నాడు. ఇది పేరుగాంచిన ఓపెన్ ఎయిర్ జూ. అందులో కొంతకాలంగా ఆయన సింహాల కేర్‌టేకర్(ఆహారం అందిస్తూ) విధులు నిర్వహిస్తున్నారు. అయితే.. బుధవారం సింహాల ఎన్‌క్లోజర్‌లో ఉండగా ఏమరపాటుగా ఆయన తన వాహనం నుంచి కిందకు దిగారు. అంతే సింహాలు ఒక్కసారిగా ఆయనపై ఎగబడ్డాయి.సుమారు 15 నిమిషాలపాటు అవి ఆయనపై దాడి చేశాయి. ఆ సమయంలో కొందరు పర్యాటకులు.. వాహనాల హారన్లు కొడుతూ, గట్టి గట్టిగా అరుస్తూ వాటిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆలస్యమైంది. జూకీపర్ శరీరంలో కొంత భాగాన్ని పీక్కుతిన్నాయి. ఎలాగాలో వాటి నుంచి ఆయన్ని లాగేసి.. ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే దారిలోనే ఆయన ప్రాణం పోయిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై Safari World Bangkok స్పందించింది. గత 40 ఏళ్లలో ఇలాంటి దాడి జరగడం ఇదేనని తెలిపింది. ఈ ఘటన నేపథ్యంలో భధ్రతా చర్యలను కఠినంగా అమలు చేస్తామని పేర్కొంది. కింది వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయొచ్చు.. A zookeeper on Wed was attacked and killed by a pack of #lions at a #Bangkok #zoo, as tourists witnessed the incident and tried to intervene to save him. The shocking attack lasted about 15 minutes, with visitors attempting to intervene by honking car horns and shouting to… pic.twitter.com/8ZzsKFwXU0— Shanghai Daily (@shanghaidaily) September 11, 2025సింహాలు మనుషుల్ని తింటాయా?.. సింహాలు మనుషుల్ని వేటాడడం.. అత్యంత అరుదుగా జరుగుతుంది. సాధారణంగా అవి మనుషుల్ని ఆహారంగా పరిగణించవు. జింకలు, జీబ్రాలు, అడవి దున్నలు.. ఇలా పరిమాణంలో పెద్దగా ఉండే జంతువులు వాటి సహజ ఆహారం. గాయపడిన సింహాలు, వయసైపోయిన సింహాలు వేటాడలేని స్థితిలో మనుషులపై దాడి చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే.. అడవుల్లో జంతువుల సంఖ్య తగ్గిపోయినా ప్రత్యామ్నాయంగా పశువులు, మనుషుల మీద దాడి చేయొచ్చు. ఈ క్రమంలో.. ఒకసారి సింహం మనిషిని వేటాడితే గనుక ఆ ప్రవర్తనను కొనసాగించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు.. కొన్నిసార్లు తన పిల్లలకూ మనుషుల్ని వేటాడడం నేర్పిస్తాయట. Tsavo Man-Eaters (1898).. కెన్యాలో రెండు సింహాలు 135 మంది రైల్వే కార్మికులను చంపినట్లు రికార్డులు ఉన్నాయి. అలాగే.. Njombe Man-Eaters (టాంజానియా) పేరిట కొన్ని సింహాలు తరతరాలుగా మనుషులపై వేటాడినట్లు ఆధారాలు ఉన్నాయి.