ముంబై పేలుళ్ల కేసులో మరో నిందితుడు మృతి
ముంబై : ముంబై వరుస బాంబు పేలుళ్లలో నిందితుడు యాకుబ్ మెమన్ మరణించిన వారం రోజుల లోపే మరో నిందితుడు ఆకస్మాత్తుగా మరణించాడు. ఈ బాంబు పేలుళ్లలో మరో నిందితుడు యాకుబ్ ఖాన్ అలియాస్ యెద్ యాకుబ్ బుధవారం పాకిస్థాన్లోని కరాచీలో మరణించాడు. ఈ మేరకు భారత నిఘా వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీంకి అత్యంత సన్నిహితుడైన యాకుబ్ ఖాన్ ఇటీవల అనారోగ్యానికి గురైయ్యాడు.
ఆ క్రమంలో బుధవారం అతడికి తీవ్ర గుండె పోటు వచ్చింది. దాంతో కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మద్యంలోనే మరణించాడని నిఘా వర్గాలు వెల్లడించాయి. అయితే ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా మాత్రం యాకుబ్ ఖాన్ మరణంపై అధికారికంగా తెలియలేదని... మీడియా వార్త కథనాల ద్వారా మాత్రమే తెలిసిందన్నారు.
యాకుబ్ ఖాన్తోపాటు అతడి పెద్ద సోదరుడు మజీద్లు టైగర్ మెమన్తో కలసి ముంబై వరుస బాంబు పేలుళ్లలో కీలక పాత్ర పోషించారని సమాచారం. అలాగే పేలుడు పదార్ధం ఆర్డీఎక్స్ ఇతర ప్రాంతాల నుంచి ముంబై నగరానికి తీసుకువచ్చి వివిధ ప్రాంతాలలో తరలించడంలో వీరు ప్రముఖంగా వ్యవహరించారు. ఆ తర్వాత యాకుబ్ ఖాన్ దుబాయి మీదగా కరాచీ చేరుకుని పాక్లో ఆశ్రయం పొందుతున్నాడు.