breaking news
Xperia Z1
-
ప్రీమియం ఫోన్లదే హవా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ప్రీమియం స్మార్ట్ఫోన్ల హవా నడుస్తోంది. రూ.30 వేలకుపైగా ఖరీదున్న ప్రీమియం మోడళ్ల అమ్మకాలు ఏకంగా రెండింతలపైగా వృద్ధి నమోదు చేస్తున్నాయి.దీన్నిబట్టి చూస్తే భారతీయులకు గ్యాడె్జట్లపట్ల ఉన్న ఆసక్తి ఇట్టే అర్థమవుతోంది. ప్రధానంగా 35 ఏళ్ల లోపున్న యువత ఇటువంటి ఖరీదైన మోడళ్లకు ఆకర్షితులవుతున్నారు. మార్కెట్లోకి కొత్త మోడల్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవారూ లేకపోలేదు. మార్కెట్ రిసెర్చ్ కంపెనీ జీఎఫ్కే అధ్యయనం ప్రకారం దేశంలో స్మార్ట్ఫోన్ల పరిమాణం 3.3 కోట్ల యూనిట్లు. ఇందులో ప్రీమియం విభాగం వాటా విలువ పరంగా చూస్తే 25 శాతం, పరిమాణం పరంగా 20 శాతం ఉందని సోని ఇండియా మార్కెటింగ్ హెడ్ తడటో కిముర తెలిపారు. రూ.44,990 ధర కలిగిన ఎక్స్‌పీరియా జడ్1 స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారమిక్కడ ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రీమియం ఫోన్ బ్రాండ్‌గా.. మొబైల్ ఫోన్లను ప్రీమియం బ్రాండ్‌గా నిలపడమే సంస్థ తొలి ప్రాధాన్యత అని సోని వెల్లడించింది. ఎక్స్‌పీరియా జడ్ ఆవిష్కరణతో బ్రాండ్ ఇమేజ్ బలపడిందని తెలిపింది. రూ.30 వేలపైన ఖరీదున్న అయిదు రకాల మోడళ్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. భారత్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో సోని ఎక్స్‌పీరియా వాటా 10 శాతముంది. 2013-14లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 20 శాతం వాటా లక్ష్యంగా చేసుకున్నామని, వచ్చే ఏడాది మార్చికల్లా తొలి స్థానం సాధిస్తామని కిముర అన్నారు. హిట్ మోడల్స్‌నే ప్రవేశపెడతామని చెప్పారు. -
సోనీ ఖరీదైన స్మార్ట్‌ఫోన్; స్మార్ట్‌వాచ్ 2 కూడా విడుదల
న్యూఢిల్లీ: సోనీ ఇండియా కంపెనీ వాటర్ ప్రూఫ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ‘ఎక్స్‌పీరియా జడ్1’ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. 20.7 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న ఈ ఫోన్ ధరను రూ.44,990గా కంపెనీ నిర్ణయించింది. దీంతో పాటు రూ.14,990 ధర ఉన్న స్మార్ట్‌వాచ్2ను, రూ.16,990 విలువున్న వెర్లైస్ బ్లూటూత్ స్పీకర్, డీఎస్సీ-క్యూఎక్స్-100(ధర రూ.24,990) డీఎస్సీ-క్యూఎక్స్10(ధర రూ.12,990) సైబర్ షాట్ కెమెరాలను కూడా విడుదల చేసింది. స్మార్ట్‌వాచ్ 2 విక్రయాలు అక్టోబర్ నుంచి ప్రారంభిస్తామని పేర్కొంది. స్పీడ్ ప్రాసెసర్: ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ పీసీల్లో ఉపయోగించే అత్యంత వేగమున్న 2.2 క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ను ఈ ఫోన్లో అమర్చారు. ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఓఎస్‌పై పనిచేసే ఈ ఫోన్లో 5 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే, 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 64 జీబీ వరకూ ఎక్స్పాండ్ చేసుకోవడానికి మెమరీ కార్డ్ స్లాట్, 20 మెగాపిగ్జల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. వై-ఫై, 2జీ, 3జీ, 4జీలను సపోర్ట్ చేస్తుంది. సులభ వాయిదాల్లో సోనీ స్మార్ట్‌ఫోన్: వడ్డీ లేకుండా 12 నెలసరి వాయిదాల్లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చని సోనీ ఇండియా ఎండీ కెనిచిరో హిబి చెప్పారు. ప్రాసెసింగ్ చార్జీలుండవని, రూపాయి కూడా డౌన్ పేమెంట్ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. హై ఎండ్ మొబైల్ మార్కెట్లో వాటాను రెట్టింపు చేసుకోవడం(20%)లక్ష్యంగా ఎక్స్‌పీరియా జడ్1ను అందిస్తున్నామని చెప్పారు. ప్రారంభ ఆఫర్‌గా ఎక్స్‌పీరియా జడ్1 కొనుగోలుపై రూ.2,790 విలువైన పోర్టబుల్ యూఎస్బీ చార్జర్‌ను ఉచితంగా ఇస్తున్నామని హిబి తెలిపారు. వొడాఫోన్ నుంచి 8 జీబీ ఇంటర్నెట్ యూసేజీ, ఆరు నెలల వరకూ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ కూడా ఉచితమని వివరించారు.