breaking news
World financial sector
-
వ్యవసాయ కూలీలు, డ్రైవర్లకు భారీ ఉపాధి
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో వ్యవసాయ, నిర్మాణ కూలీలు, డ్రైవర్ల ఉద్యోగాలు (డెలివరీ రంగాల్లో) గణనీయంగా పెరగనున్నట్టు ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) తెలిపింది. అదే సమయంలో క్యాషియర్లు, టికెట్ క్లర్క్‌ల ఉద్యోగాలు పెద్ద ఎత్తున తగ్గిపోతాయని అంచనా వేసింది. ఈ నెల 20 నుంచి డబ్ల్యూఈఎఫ్ వార్షిక సదస్సు జరగనుండగా, దీనికంటే ముందు ‘ఉద్యోగాల భవిష్యత్, 2025’ పేరుతో నివేదికను విడుదల చేసింది. 2030 నాటికి 17 కోట్ల ఉద్యోగాలు కొత్తగా అందుబాటులోకి వస్తాయని, ఇందులో 9.2 కోట్ల ఉద్యోగాలకు స్థానచలనం ఉంటుందని అంచనా వేసింది. అంటే 7.8 కోట్ల మందికి నికరంగా కొత్తగా ఉపాధి లభించనుంది. అత్యాధునిక టెక్నాలజీలు, భౌగోళిక పరమైన మార్పులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక ఒత్తిళ్లు ఈ మార్పులను నడిపిస్తాయంటూ, పరిశ్రమలు, వృత్తుల ముఖచిత్రం మారిపోనుందని అంచనా వేసింది. ఏఐ, బిగ్‌డేటాకు భారీ డిమాండ్ కృత్రిమ మేధ (ఏఐ), బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీకు వేగవంతమైన వృద్ధితోపాటు, డిమాండ్ ఉంటుందని డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. అదే సమయంలో మానవ నైపుణ్యాలైన సృజనాత్మకత, చురుకుదనం, బలమైన దృక్పథం ఇక ముందూ కీలకమని పేర్కొంది. 1,000 కంపెనీలకు సంబంధించిన డేటాను విశ్లేషించగా, వ్యాపారాల నవీకరణకు నైపుణ్యాల అంతరం పెద్ద అవరోధంగా ఉన్నట్టు గుర్తించింది. ఉద్యోగాలకు సంబంధించి 40 శాతం నైపుణ్యాలు మారిపోనున్నాయని, 63 శాతం సంస్థలు ఇప్పటికే నైపుణ్యాల అంతరాన్ని ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. జెనరేటివ్ ఏఐ, వేగంగా మారిపోయే టెక్నాలజీలు పరిశ్రమలకు, ఉపాధి మార్కెట్‌కు గణనీయమైన అవకాశాలను తీసుకురావడమే కాకుండా, పెద్ద ఎత్తున రిస్క్ కూడా మోసుకొస్తాయని డబ్ల్యూఈఎఫ్ ‘ఉపాధి కల్పన’ విభాగం హెడ్ టిల్ లియోపోల్డ్ అన్నారు. సంరక్షణ ఉద్యోగాలైన నర్సులు, సెకండరీ స్కూల్ టీచర్ల ఉద్యోగాలు కూడా గణనీయంగా పెరొగొచ్చని ఈ నివేదిక అంచనా వేసింది. ఏఐ వినియోగం ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలను గణనీయంగా మార్చివేయనుందని, దాదాపు సగం సంస్థలు ఏఐతో కొత్త అవకాశాలను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపింది. ముఖ్యంగా ఏఐ సాయంతో తమ సిబ్బందిని తగ్గించుకోవాలని 41 శాతం సంస్థలు భావిస్తున్నట్టు పేర్కొంది. మరో 77 శాతం సంస్థలు తమ సిబ్బందికి నైపుణ్యాల పెంపుపై శిక్షణ ఇప్పించే యోచనతో ఉన్నట్టు వివరించింది. -
పెట్టుబడులకు స్వర్గధామం..!
చీకట్లో ఉన్న అంతర్జాతీయ ఆర్థిక రంగానికి కాంతిరేఖ భారత్ ♦ పన్నుల వ్యవస్థను, వ్యాపార ప్రక్రియను మరింత సరళీకరిస్తాం ♦ మేధో హక్కులను పరిరక్షిస్తాం ♦ ఇండో జర్మన్ బిజినెస్ లీడర్ల సదస్సులో ప్రధాని మోదీ బెంగళూరు: ‘ప్రపంచ ఆర్థిక రంగంలో చీకట్లు అలుముకున్న సమయంలో.. పెట్టుబడులకు వెలుగురేఖగా భారత్ నిలుస్తోంద’ని ప్రధాని మోదీ అభివర్ణించారు. భారత్‌లో పెట్టుబడులకు, వ్యాపారాలకు ఇది సరైన సమయమని పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే అంతర్జాతీయంగా ప్రముఖ వ్యాపార సంస్థల దృష్టిలో భారత్ విశ్వసనీయతను తిరిగి నిలబెట్టగలిగామన్నారు. బెంగళూరులో మంగళవారం నాస్కామ్ ఆధ్వర్యంలో జరిగిన ఇండోజర్మన్ బిజినెస్ సమ్మిట్‌లో జర్మనీ చాన్స్‌లర్ ఎంజెలా మెర్కెల్‌తో కలసి మోదీ పాల్గొన్నారు. సదస్సులో భారత్, జర్మనీలకు చెందిన ఐటీ, వ్యాపార, వాణిజ్య ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సరళమైన పన్ను వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, మేధో హక్కులను పరిరక్షిస్తామని పెట్టబడిదారులకు మోదీ హామీ ఇచ్చారు. వస్తు సేవల పన్ను(జీఎస్టీ) బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టామని, సంబంధిత చట్టం 2016 నుంచి అమల్లోకి వస్తుందన్న విశ్వాసం తనకుందన్నారు. పెట్టుబడులకు, వ్యాపారాలకు అత్యంత అనువైన దేశంగా భారత్‌ను మార్చేందుకు తన ప్రభుత్వం చేపట్టిన, చేపట్టనున్న చర్యలను మోదీ వివరించారు. త్వరలో దివాళా నిబంధనావళిని రూపొందిస్తామని, కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నిజమైన పెట్టుబడిదారులకు, నిజాయితీ పరులైన పన్ను చెల్లింపుదారులకు పన్నుల విషయాల్లో సులభతరమైన విధానాన్ని అవలంబిస్తామన్నారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత చాన్నాళ్లుగా ఇన్వెస్టర్లలో నెలకొన్న భయాందోళనలను తొలగించామని తెలిపారు. ఎఫ్‌పీఐలపై కనీస ప్రత్యామ్నాయ పన్ను(ఎమ్ఏటీ)ను విధించబోమన్నారు. భారత్, జర్మనీ సంబంధాలు సామర్ధ్యానికి తగ్గ స్థాయిలో లేవన్న మోదీ.. జర్మనీ బలంగా ఉన్న రంగాల్లో తాము భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామన్నారు.మెట్రో రైల్, జాతీయ రహదారులు, 100 స్మార్ట్ సిటీలు, 5 కోట్ల ఇళ్లు, రైల్వేల అధునీకరణ.. తదితర అనేక రంగాల్లో పెట్టుబడులకు, వ్యాపారాలకు భారత్‌లో అపార అవకాశాలున్నాయని, జర్మన్ కంపెనీలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని మోదీ కోరారు. ‘ప్రపంచవ్యాప్తంగా హార్డ్‌వేర్‌ను నడిపిస్తోంది భారత సాఫ్ట్వేర్.. అంతర్జాతీయ సాంకేతికతను సుసంపన్నం చేస్తోంది భారత దేశ సామర్ధ్యం..దేశదేశాల్లో ఉత్పత్తి వ్యవస్థకు స్ఫూర్తినిస్తోంది భారత మార్కెట్’ అని వ్యాఖ్యానించారు. సదస్సులో మోదీ, మెర్కెల్‌ల సమక్షంలో ఐదు బీ టూ బీ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇండో- ఈయూ ఫ్రీ ట్రేడ్ చర్చలు పునఃప్రారంభం కావాలి సదస్సులో మెర్కెల్ మాట్లాడుతూ.. భారతీయ ఇన్వెస్టర్లను జర్మనీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. భారత్, యూరోపియన్ యూనియన్ల మధ్య ఫ్రీ ట్రేడ్ ఒప్పందానికి సంబంధించిన చర్చలను పునః ప్రారంభించాలన్నారు. జర్మనీ, భారత్‌ల మధ్య వాణిజ్యం 16 బిలియన్ యూరోలకు చేరిందని, ఈ సంవత్సరం అది మరింత పెరగాలని ఆకాంక్షించారు. 1,600లకు పైగా జర్మన్ కంపెనీలు భారత్‌లో క్రియాశీలకంగా ఉన్నాయని, వాటిలో కొన్ని వందేళ్లకు పైగా భారత్‌లో సేవలందిస్తున్నాయన్నారు. ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం జీ 4 దేశాలుగా భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్ పరస్పరం సహకరించుకుంటున్నాయన్నారు. టర్కీలో ఈ నవంబర్‌లో జరిగే జీ 20 దేశాల సదస్సు సందర్భంగా మరోసారి మోదీతో భేటీ అయ్యే అవకాశం తనకు లభిస్తుందన్నారు. అంతకుముందు, ఇరువురు నేతలు బెంగళూరులోని జర్మన్ ఆటోమోటివ్ సంస్థ బాష్ ప్రాంగణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భారత్‌లో 2015లో రూ. 650 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు బాష్ ప్రకటించింది.