breaking news
wedding hubbub
-
పందిట్లో పెళ్లి ఉంది... టీవీలో మ్యాచ్ ఉంది!
ఫిబ్రవరి 15 జయనామ సంవత్సరం మాఘమాసం బహుళశుద్ధ ఏకాదశి అనగా ఫిబ్రవరి 15వ తేదీన తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ పెళ్లిసందడి ఫుల్‌గా ఉంది. ఆదివారం కూడా కావడంతో ఈ సందడికి మరింత శోభ కనిపిస్తోంది! అయితే ఈ ఘడియలకు ఎంతో ఉత్సాహంగా రెడీ అయిపోతున్న కుర్రకారులో ఇప్పుడు కొత్త చింత మొదలైంది. ఇదే ముహూర్తానికి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉండడంతో మొదలైన చింత అది. ఐసీసీ ఎప్పుడో వేసిన షెడ్యూల్లో ఏరికోరి ఆదివారం రోజున ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌ను సెట్ చేసింది. ఆవిధంగా విద్యార్థులు, ఉద్యోగులు సెలవు పెట్టేయాల్సిన అవసరాన్ని తప్పించింది. అయితే ఈ హాలిడే మంచి ముహూర్తం కూడా కావడంతో పెళ్లిళ్లు షెడ్యూల్లోకి వచ్చేశాయి! సగటు క్రికెట్ అభిమానికి ఇంతకన్నా విపత్కరస్థితి ఉండదేమో! మ్యాచ్చా... మ్యారేజా.. అనే విషయాన్ని తేల్చుకోవాల్సిన సంకటంలో పడ్డారు. భారత కాలమానం ప్రకారం ఉదయం తొమ్మిదింటికే మ్యాచ్ మొదలవుతుంది. పెళ్లిళ్లు కూడా అదే సమయంలో జరుగుతాయి. ఒకవేళ మ్యాచ్ కోసమని చెప్పి పెళ్లిళ్లకు డుమ్మా కొట్టేస్తే దగ్గరవాళ్ల దృష్టిలో అంతకు మించి ద్రోహమూ ఉండదాయె! ఇప్పుడెలా అంటే.. దీనికో పరిష్కారం ఉంది. చరిత్ర చూపిన పరిష్కారం అది. వరల్డ్‌కప్ సీజనే మన సమీప బంధువుల శుభకార్యాలకూ సీజన్ అయితే అలాంటి సందర్భాల్లో శుభకార్యపు వేదికల వద్ద టీవీలు ఏర్పాటు చేసే సంప్రదాయం ఉంది. ఇప్పుడు కూడా దాన్ని ఫాలో అయితే చాలు! ఈ బాధ్యతను వధూవరులకే అప్పగించేస్తే.. కల్యాణ మండపంలో టీవీ ఉంటేనే పెళ్లికి వస్తాం... మరి మీ ఇష్టం.. అని ఒక హెచ్చరిక జారీ చేస్తే టెన్షన్ తగ్గిపోతుంది. -
విషాదం
చీడికాడ/గోపాలపట్నం ,న్యూస్‌లైన్: వివాహవేడుకల్లో వారంతా ఆనందగా గడిపారు. సమీపంలోని జలాశయానికి విహారయాత్రకు వెళ్లిన వారిపై విధి కన్నెర్ర చేసింది. బోటులో షికారు చేయకముందే ఇద్దరిని అందని తీరాలకు చేర్చింది. రెండు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. అప్పటివరకు ఎంతో ఉత్సాహంగా పెళ్లి సందడిలో మునిగి తేలిన వారంతా అంతలోనే కన్నీరుమున్నీరయ్యారు. విశాఖ గోపాలపట్నం శివారు కొత్తపాలెం నాగేంద్రకాలనీకి చెందిన ముస్లింలు చీడికాడ మండలం శిరిజాంలో వివాహానికి శుక్రవారం హాజరయ్యారు. అక్కడ మధ్యాహ్నం భోజనాలు చేశాక కోనాం జలాశయాన్ని చూడ్డానికి వెళ్లారు. అందులో బోటు షికారుకు ఆసక్తి చూపారు. ఒడ్డున ఉన్న ఒక మత్స్యకారుడి బోటులోకి ఎనిమిదిమంది మహిళలు ఎక్కి కూర్చున్నారు. అంతా ఒకే వైపునకు వెళ్లడంతో సుమారు 30 అడుగుల లోతున నీటిలోకి ఒరిగిపోయింది. మహిళలంతా జలాశయంలో పడిపోయారు. వారిలో ముగ్గురిని బోటు డ్రైవర్ రంసాల దేముడు, మరో ముగ్గురిని వారితో వచ్చిన యువకులు రక్షించి ఒడ్డుకు చేర్చారు. షేక్ యాస్మిన్ (15), షేక్ ముంతాజ్ బేగం(30)లు గల్లంతయ్యారు. స్థానిక మత్స్యకారులు వలలతో గాలించగా సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో యాస్మిన్ మృతదేహం బయటపడింది. మరో అరగంట తరవాత ముంతాజ్‌బేగం మృతదేహం దొరికింది. ఏకైక కుమార్తె యాస్మిన్ కళ్లముందే చనిపోవడంతో తండ్రి పీర్సాహెబ్ను ఓదార్చడం ఎవరితరమూ కావడం లేదు. బోటు షికారుకి తీసుకొచ్చిన భార్య ముంతాజ్‌బేగం నీటిలో మునిగిపోవడం కళ్లారా చూసిన భర్త మస్తాన్ వేదన వర్ణనాతీతం. ఇక అమ్మ లేదని ఇద్దరు పిల్లలకు ఎలా చెప్పేదంటూ అతడు విలపిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. బంధువులు, స్థానికులు ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. విషయం తెలుసుకున్న కోనాం వైఎస్సార్ సీపీ నాయకులు జి.సత్యనారాయణరాజు, రెడ్డి సన్యాసినాయుడులు జలాశయం వద్దకు చేరుకొని బాధితులను ఓదార్చారు. ఈ సమాచారంతో గోపాలపట్నం నాగేంద్రకాలనీలో విషాదం అలుముకుంది. చీడికాడ ట్రైనీ ఎస్ఐ ప్రభాకరరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టానికి ఆస్పత్రికి తరలిస్తామన్నారు. తరచూ ప్రమాదాలు జిల్లాలో విహార యాత్రకు కోనాం జలాశయం ప్రాంతానికి మంచి గుర్తింపు. కానీ తరచూ నాటుపడవల ప్రమాదాలతో విషాదం చోటుచేసుకుంటోంది. 1996లో ఇదే జలాశయంలో బోటు బోల్తాపడి 21మంది గిరిజనులు చనిపోయారు. గత ఎనిమిదేళ్లలో పలు ప్రమాదాల్లో మరో 15మంది వరకు మృత్యువాతపడ్డారు.